Home > Politics - Gossip
గుత్తాను బలిపశువు చేయడం లేదు కదా?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు కొన్ని చోటు చేసుకోబోతున్నాయా? తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కొన్ని పుకార్లను గమనిస్తోంటే.. అలాగే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించి ప్రస్తుతం తెరాసలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి.. నల్లగొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి.

వీటిలో నిజానిజాలు తేలకపోయినా.. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా.. పాలక పక్షానికి ప్రజల్లో ఆదరణ ఉన్నట్లుగా.. ఏపీలోని అధికారపక్షం నిరూపించుకున్నట్లుగా తెలంగాణలో నల్గొండలో ఉప ఎన్నిక వచ్చేలా గుత్తాను రాజీనామా చేయించి.. ఆ తరువాత... తమకు ప్రజాదరణ తగ్గలేదని నిరూపించుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. 

నిజానికి ఈ ప్రయోగం అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే.. సందర్భం వస్తే తప్ప.. ఏ సర్కారు కూడా తమకు ప్రజాదరణ ఉన్నదని చెప్పుకోవడానికి ఒక ప్రయోగానికి సాహసించదు. అది కూడా లాంటి ఉప ఎన్నిక వంటి ప్రయోగం అసలు చేయదు. పైగా ఈ విషయంలో తెరాసకు మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. గుత్తా ఒక్కరే కాదు వేరే పార్టీల ద్వారా గెలిచిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్న వారు మరికొందరు కూడా ఉన్నారు.

ఏదో నామ్ కే వాస్తే నల్గొండలో రాజీనామా చేయించడం కాదని, దమ్ముంటే.. తమ నిజాయితీని, ప్రజాదరణ తగ్గలేదని నిజంగానే నిరూపించుకోదలచుకుంటే.. ఫిరాయించి వచ్చిన అందరు ఎంపీలతోను రాజీనామా చేయించాలని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తే గనుక.. చాలా పెద్ద పితలాటకం అవుతుంది. అక్కడితో ఇది ఆగకపోవచ్చు. ఎంపీల రాజీనామాలు కాదని.. దమ్ముంటే ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తేనే.. అసలు సత్తా తెలుస్తుందని అంటే.. తెరాస సర్కారుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే. అందుకే, అంత సాహసానికి పూనుకునే అవకాశం తక్కువ.

ఒకవేళ కేసీఆర్ దూకుడుగా నిర్ణయం తీసుకుని గుత్తాతో రాజీనామా చేయిస్తే గనుక.. తర్వాతి ఫలితాలను ఇప్పుడే బేరీజు వేయడం కష్టం అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. నల్గొండ గతంలో కాంగ్రెస్ గెలిచిన సీటు. ఈ ఎంపీ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో గతంలో తెరాస గెలిచింది ఒకే సీటు. ఇలాంటి కాంబినేషన్లో ఉప ఎన్నికకు వెళ్లడం అంటే.. కొంపదీసి గుత్తా సుఖేందర్ రెడ్డిని బలిపశువును చేసినట్లు అవుతుందేమో అని కూడా పలువురు సందేహిస్తున్నారు.

ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ.. కాంగ్రెస్ లో తమ సత్తా చాటుకోవాలని చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ బరిలోకి దిగితే.. పోటా చాలా సీరియస్ అయిపోతుంది. తెరాసకు ఫలితం తేడా కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే.. గుత్తా.. ఏదో రైతు సమితుల సారధిగా దక్కే కేబినెట్ స్థాయి హోదాతోనే.. తృప్తి పడాల్సి వస్తుందే తప్ప.. ఉన్న పదవి కాస్తా హరీ మనే ప్రమాదం పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలో గుత్తా స్థానంలో ఉప ఎన్నిక అంటూ వస్తున్న వార్తలపై రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి.