Advertisement


Home > Politics - Gossip
మళ్లీ అదే చెప్తే జనం నమ్ముతారా జగన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో మంగళవారం నిర్వహించిన యువభేరి చాలా ఘనంగానే మొదలైంది. ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రప్రదేశ్ కు దక్కబోయే అదృష్టం గురించి ఆయన గట్టిగానే చెప్పారు, అందుకు తాము ఆపకుండా పోరాటం సాగిస్తాం అని కూడా చెప్పారు. మోడీ సర్కారు మీద కూడా ఆయన విసుర్లు వేశారు. ఓట్లకోసం ఒక మాటచెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని అన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం జగన్ చెప్పిన మాటలను జనం నమ్ముతారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అదే ‘ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తా’ అనే ప్రకటన!

వైఎస్ జగన్మోహన రెడ్డి అనాలోచితంగా అన్నారో ఆవేశంలో అన్నారో గానీ.. కేంద్రం గనుక ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తమ పార్టీ ఎంపీల ద్వారా రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్తాం అని.. మళ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి.. ప్రజల ఆకాంక్షలు ప్రత్యేకహోదాకు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని ఢిల్లీ సర్కారుకు తెలిసేలా చేస్తాం అని హెచ్చరించారు. ఆ సమయంలోనే ఆయన ఆ రాజీనామాలకు డెడ్ లైన్ కూడా పెట్టారు.

పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే.. తమ పార్టీ ఎంపీలు  రాజీనామాలు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్పిన పార్లమెంటు సమావేశాలు ఎప్పుడో  ముగిసిపోయాయి. ఆ తర్వాత కూడా రెండు మూడు దఫాలుగా పార్లమెంటు సమావేశాలు ముగిసిపోవడమూ జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయడం మాత్రం జరగనేలేదు. చివరికి వైకాపా ఎంపీల రాజీనామా అనేది ఒక హాస్యాస్పదమైన వ్యవహారంగా మారిపోయింది. 

అయితే జగన్మోహన రెడ్డి తన పార్టీ వైఖరిని రాజీనామాలు చేయకుండా ఉన్నందుకు కారణాల్ని సమర్థించుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే.. పార్లమెంటులో ఏపీ నుంచి ఉన్న ఎంపీల్లో తెలుగుదేశం, భాజపాకు చెందిన వారంతా.. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ఆశల మీద నీళ్లు చిలకరిస్తున్న వాళ్లే.

కనీసం పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ హోదా గురించి ప్లకార్డు లు పట్టుకుని నిల్చోవాలన్నా... అంతో ఇంతో హోదా గురించి ప్రశ్నలు అడగాలన్నా కేవలం తమ పార్టీ ఎంపీలు మాత్రమే చేస్తున్నారు గనుక.. హోదా విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని తమ ఎంపీలు మాత్రమే ప్రస్తావిస్తున్నారు గనుక.. ఆ అవకాశం కూడా ఏపీకి దక్కకుండా పోరాదని రాజీనామా ల విషయంలో వెనక్కు తగ్గాం అని చెప్పి ఉంటే చాలా సబబుగా ఉండేది. 

కానీ జగన్ మళ్లీ పొరబాటు చేశారు. ఇన్ని నెలలుగా రాజీనామాల అంశాన్ని ప్రస్తావించకుండా.. అనంతపురం యువభేరి సభలో.. తన పాదయాత్రలో కూడా ప్రత్యేకహోదా కోసం ప్రజల మద్దతును కూడగట్టడం జరుగుతుందని, ముగిసేలోగా.. ఎంపీలతో రాజీనామాలు చేయించడం కూడా జరుగుతుందని ఆయన మళ్లీ ఆ విషయం ప్రస్తావించారు. ఇలా నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల.. ప్రజల్లో పలుచన కావడం తప్ప.. మరో లాభం ఏముంటుంది.

చివరి అస్త్రంగా రాజీనామాలు అంటున్నారు. ఆ రకంగా జగన్ తమ ఎంపీల రాజీనామా అనే ఎపిసోడ్ ను మరో ఆరేడు నెలలు వాయిదా వేశారు.  ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు 10-11 నెలల దూరం మాత్రమే ఉంటుంది. వారు రాజీనామాలు చేసి, అవి ఆమోదం పొంది, ఉప ఎన్నికలు రావడం కూడా అసాధ్యమే అవుతుంది. అప్పటికి ఎవరి హామీలు, ఎవరికి గుర్తుంటాయో.. వాటి గురించి అడిగే దిక్కు ఉంటుందో లేదో ఎవరికెరుక? ఇలా ప్రజల ముందుకు వచ్చిన  ప్రతిసారీ ఒక డెడ్ లైన్ మార్చుకుంటూ.. ఎంపీలతో రాజీనామా చేయిస్తా.. అనేది ఏదో తాయిలంలాగా చెబితే జనం నమ్ముతారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.