Advertisement


Home > Politics - Gossip
‘డీల్స్ మాట్లాడండి.. జంప్ జిలానీల్ని వెతకండి’

చంద్రబాబు తాజా హుకుం ఇది. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ జరగబోతున్న ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించాల్సిందేనని చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పురమాయించేశారుట. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇదే చర్చ నడుస్తోంది. కాకినాడలో అయితే విజయం దక్కి తీరాల్సిందే.. అవసరమైతే డీల్స్ మాట్లాడండి.. వైసీపీ నుంచి వచ్చే జంప్ జిలానీలు ఎవరైనా ఉంటే.. ఆఫర్లు మాట్లాడండి అనికూడా చంద్రబాబునాయుడు లోకల్ గా ఉండే పార్టీ వారిని పురమాయించినట్లుగా చెప్పుకుంటున్నారు.

మునిసిపాలిటీలకు పాలకవర్గాల గడువు ముగిసిపోయి ఎంతో కాలం గడచిపోయింది. ఎన్నికలు నిర్వహించడం అనేది ఎంతోకాలంగా పెండింగ్ లో ఉండిపోయింది. తమకు అనుకూల పరిస్థితులు లేనిచోట అసలు ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం సుముఖుంగా లేదనే విమర్శలు కూడా విపరీతంగా వచ్చాయి. పాలకవర్గాల గడువులు ముగిసిపోయినా.. ఇప్పటికీ ఎన్నికల సంగతి పట్టించుకోని తిరుపతి వంటి మునిసిపాలిటీలు కూడా ఉన్నాయి.  ఆ క్రమంలో కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కు ఇన్నాళ్లకు ఎన్నికల యోగం వచ్చింది. 

నిజానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి డోలాయమానంగా ఉంది. పార్టీ పరంగా చూసినప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికల నాటి సానుకూల వాతావరణం ఇప్పుడు లేదు. పైగా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి పెద్ద చికాకు ఎదురవుతోంది. భాజపా తనంత తాను తమ బలం పెరిగిపోయిందని ఊహించుకుంటోంది. దానికి తగినట్లుగా వారు ఎక్కువ స్థానాల్ని డిమాండ్ చేస్తున్నారు. వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు తెదేపా సిద్ధంగా లేదు.

ఆ నేపథ్యంలో భాజపా వారు ఇప్పటికే 30 వార్డుల్లో నామినేషన్లు వేసేశారు. పూర్తిగా నగర ఓటర్ల పరిధిలోనే జరిగే ఎన్నిక గనుక.. తాము చెప్పే డొంకతిరుగుడు కబుర్లు, ప్రలోభాల హామీలకు జనం పడిపోవడం అంత ఈజీ కాదనేది చంద్రబాబునాయుడు కోటరీ అభిప్రాయంగా ఉంది. పైగా మారుతున్న పరిస్థితులు... ఈ మూడేళ్లలో పాలన మీద సడలిపోతున్న నమ్మకం ఇత్యాది కారణాలన్నీ ఇలాంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని తెలుగుదేశం ఆందోళన చెందుతోంది.

అందుకే చంద్రబాబునాయుడు విజయం కోసం ‘అన్ని మార్గాలను’ అన్వేషించాలని శ్రేణులకు పురమాయించేశారుట. ఇతర పార్టీల్లో ఉన్నవారితో డీల్స్ మాట్లాడాలని, అవసరమైతే... జంప్ జిలానీలు ఏ పార్టీ నుంచి వచ్చినా తెలుగుదేశంలో చేర్చేసుకుందాం అని ఆయన అంటున్నారుట. చంద్రబాబు పురమాయిస్తున్నారు సరే.. కానీ ప్రజల్లో నమ్మకం సడలిపోతున్న పార్టీలోకి ఆనందంగా రావడానికి ఇతర పార్టీల్లోని వారు రెడీయేనా అని జనం అనుమానిస్తున్నారు.