Advertisement


Home > Politics - Gossip
ఫైనల్ గా యనమల పంతం నెగ్గిందా?

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం అంటే.. దేశంలోనే నామినేటెడ్ పోస్టుల విషయంలో అది చాలా కీలకమైన పదవి. చాలా మంది దేశంలోనే కొమ్ములు తిరిగిన ప్రముఖులు.. ఒక్కసారైనా ఆ పదవిలో ఉండాలని కోరుకునే వాళ్లు అనేకులు ఉన్నారు. రాష్ట్రప్రభుత్వాల్ని, కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే వారు కూడా.. ఒక్కసారి ఆ పదవి కావాలని కలలుగనే వారున్నారు.

అంత కీలకమైన పదవికి.. తన మనసులో ఎవ్వరి పేర్లు ఉన్నప్పటికీ.. వారికి కేటాయించడంలో చంద్రబాబు కృతకృత్యుడు కాలేకపోయారా? అనే ప్రచారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ పదవి విషయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం కంటె కూడా.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పంతమే నెగ్గిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్ గా టీటీడీ బోర్డు నియామక ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో రానున్నాయనే వార్తల నేపథ్యంలో పార్టీలో ఈ చర్చ జరుగుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకమైన.. టీటీడీ బోర్డు పదవి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో కూడా దీనికి ఎంత పోటీ ఉన్నప్పటికీ.. తాను  మాట ఇచ్చాడు గనుక.. చదలవాడకు కట్టబెట్టారు ఆయన. అలాగే ఈసారి కూడా.. తాను ఆబ్లిగేషన్ గా భావించే సీనియర్ నాయకులకు ఇవ్వాలని అనుకున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉంటున్నా.. ఆరోగ్య కారణాలు, పెద్ద వయసు వల్ల.. ప్రస్తుతం మంత్రి పదవులు పొందలేకుండా ఉన్న గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు ఈ అవకాశం కల్పించాలని చంద్రబాబు భావించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.

మరోవైపు నుంచి.. సినీ పరిశ్రమ దిగ్గజాలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఐఏఎస్ , పారిశ్రామికవేత్తలు ఇలా పలువురు దానికోసం చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు మదిలో కొన్ని పేర్లు, ఒత్తిళ్ల వరుసలో మరికొన్ని పేర్లు .. ఇవన్నీ ఉండగా.. పదవి మాత్రం.. యనమల వియ్యంకుడిని వరించింది.

చంద్రబాబు ఆబ్లిగేషన్ కంటె కూడా యనమల ఆబ్లిగేషన్ బాగా పనిచేసిందని పార్టీలో అంతా అనుకుంటున్నారు. నిజానికి సుధాకర్ యాదవ్ గత టీటీడీ బోర్డులో సభ్యుడిగా కూడా చేశారు. అయితే క్రిస్టియన్ సభలకు వెళ్లారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితేనే టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. టీటీడీ ఉద్యోగుల్లో కూడా అన్యమత పోకడలు , వాసనలు కూడా ఉండరాదనే ఉద్దేశంతో.. ఉద్యోగులంతా తిరునామం ధరించి మాత్రమే విధులకు హాజరుకావాలంటూ.. ఒకవైపు టీటీడీ ఆదేశిస్తోంది. అలాంటి టీటీడీ అధ్యక్ష పదవిలోకి అన్యమత వివాదం ఆరోపణలు ఉన్న వ్యక్తిని నియమించడం..  చర్చనీయాంశం అవుతోంది.