Home > Politics - Gossip
పెద్దల సభకు పోకుండా 'పెద్ద దెబ్బ'...?

వచ్చే సాధారణ ఎన్నికల్లో తమదే విజయమని చెప్పుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అందుకు ఉన్న ప్రధాన అడ్డంకిని తొలగించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సిపి ఆయనకున్న పెద్ద అడ్డంకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నంద్యాల, కాకినాడ విజయాల తరువాత వైకాపా గతంలో అనుకున్నంత బలంగా లేదని అర్థమైపోయింది చంద్రబాబుకు.

త్వరలో జరగబోయే కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌ల, మున్సిపాలిటీల ఎన్నికల్లోనూ వైకాపాను ఓడిస్తే అది మరింత బలహీనమైపోతుంది. ఈలోగా కొంతమంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి గుంజుకుంటే ఇక లేవలేని పరిస్థితి వస్తుంది. వైకాపా ఎమ్మెల్యేలు చాలామంది తమతో 'టచ్‌'లో ఉన్నారంటూ టిడిపి నాయకులూ రోజూ చెబుతున్నారు.

జగన్‌ లండన్‌ వెళ్లి వచ్చేసరికి కొందరు జంప్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారని, ఈలోగా బేరాలు కుదిరించుకుంటారని 'పచ్చ' పార్టీ నుంచి సమాచారం వస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదుగాని వైకాపా నుంచి వలసలు భారీగా ఉంటాయని ప్రచారం చేస్తూ జగన్‌ను భయపెడుతున్నారు. ఇప్పటికే పదిహేనుమందికి పైగా తమతో టచ్‌లో ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.

ఎమ్మెల్యేలను గుంజుకోవాలనుకోవడం వెనక పెద్ద ప్లాన్‌ ఉంది. టిడిపి నేతలు చెబుతున్నట్లు భారీగా ఎమ్మెల్యేలు వలసపోతే తెలంగాణలో టిడిపి పరిస్థితి అయినట్లుగా అవుతుంది. అలా అయినప్పుడు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా నిస్సహాయంగా మిగిలిపోతుంది. అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉండదు. అప్పుడు ఉన్న సీట్లన్నీ టిడిపికి దక్కే వీలుంటుంది.

ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభకు వెళ్లినవారిలో ఆంధ్రా కోటా కింద ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి, రేణుకా చౌదరి (కాంగ్రెసు), టిడిపికి చెందిన దేవేందర్‌ గౌడ్‌ రిటైర్‌ కాబోతున్నారు. తెలంగాణకు చెందిన దేవేందర్‌ను ఆంధ్రా కోటాలో వేశారు. అలాగే ఆంధ్రాకు చెంది తెలంగాణ కోటాలో ఉన్నా సిఎం రమేష్‌ కూడా రిటైర్‌ కాబోతున్నారు. సో... ఆంధ్రా నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైకాపాకు ఉన్న ఎమ్మెల్యేలు 46 మంది.

ఒకరు రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ లెక్కన వైకాపాకు ఒక సీటు దక్కే అవకాశం (వీరంతా కరెక్టుగా ఓటేస్తే) ఉంది. ఈ ఒక్క సీటూ దక్కనివ్వకూడదని చంద్రబాబు పంతం పట్టారు. అందుకే ఎమ్మెల్యేలను గుంజుకునే ఆలోచన చేస్తున్నారు. ఐదారుగురిని లాక్కున్నా వైకాపా పని అయిపోయినట్లే.

గత ఏడాది రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు వైకాపా విజయసాయి రెడ్డిని గెలిపించుకుంది. అప్పుడు కూడా ఆ ఒక్క సీటూ వైకాపాకు దక్కకూడదని బాబు ప్రయత్నాలు చేశారు. కాని సాధ్యం కాలేదు. సభలో టిడిపి సభ్యులతో పాటు బిజెపి సభ్యులను, ఫిరాయింపుదారులను కూడా కలుపుకుంటే అధికార పార్టీ బలం 130. వైకాపా నిర్వీర్యమైపోతే ఈ బలంతో మూడు రాజ్యసభ సీట్లూ దక్కుతాయి.

రాజ్యసభ ఎన్నికలు జరిగేలోగా కొన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండొచ్చు. ఆ ఎన్నికల్లోనూ వైకాపా ఓడిపోతే దాని ఆత్మస్థయిర్యం దెబ్బతినే అవకాశముంది. దీంతో కొందరు ఎమ్మెల్యేలు జంప్‌ చేసినా చేయొచ్చు. సాధారణ ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని వైకాపా నాయకులు చెబుతున్నా ఈలోగా ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం జగన్‌కు పరీక్షేనని చెప్పాలి.