Advertisement


Home > Politics - Gossip
వైఎస్ జగన్ తప్పు చేస్తున్నాడా?

నగరి ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం అసెంబ్లీకి హాజరు అవుతున్నారు. ఆమె మీద మరో ఏడాది కాలం సస్పెన్షన్ విధించడానికి వీలుగా... క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సిఫారసు నివేదిక స్పీకరు వద్ద పెండింగులో ఉన్నది. ఆయన దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.  ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యే రోజా ఒక ఏడాది సస్పెన్షన్ వేటును అనుభవించారు. అయితే అది సభలో ముఖ్యమంత్రిని దూషించినందుకు వేసిన సస్పెన్షన్ వేటు. ఆ శిక్షాకాలం పూర్తయింది. తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యేను అసభ్యంగా దూషించినందుకు, సదరు ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదును విచారించిన క్రమశిక్షణ కమిటీ మరో ఏడాది సస్పెన్షన్ కే సిఫారసు చేసింది. అయితే రెండోశిక్షను తప్పించుకోవడానికి రోజాకు అవకాశం ఉంది. ఆమె శాసనసభలో, సాటి తెలుగుదేశం ఎమ్మెల్యేకు క్షమాపణ చెబితే సరిపోతుంది. ఆ క్షమాపణ పట్ల స్పీకరు సంతృప్తి చెందితే ఇక చర్యలుండవు. 

ఇలాంటి నేపథ్యంలో అసలు రోజా క్షమాపణ కోరుతుందా? లేదా? అనే ప్రశ్నతో పాటూ రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు పడనున్నదా? అనే సందేహం చాలా మందిలో రేకెత్తుతోంది. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం తప్పు అనే అభిప్రాయం వారి పార్టీలోనే వ్యక్తం అవుతోంది. 

అభిజ్ఞవర్గాల సమాచారాన్ని బట్టి.. రోజా క్షమాపణ చెప్పేసి సభకు రావాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే వైఎస్ జగన్ మాత్రం వ్యూహాత్మకంగా క్షమాపణ చెప్పవద్దంటూ ఆమెను ఆపుతున్నట్లుగా తెలుస్తున్నది. మరోసారి రోజా మీద సస్పెన్షన్ వేటుపడితే.. తెలుగుదేశం సర్కారు తమ ఎమ్మెల్యేలను అకారణంగా అన్యాయంగా వేధిస్తున్నదంటూ జనందృష్టిలో పాలకుల్ని విలన్లుగా చిత్రీకరించాలనేది బహుశా ఆయన వ్యూహం కావొచ్చు. అందుకే క్షమాపణ చెప్పవద్దంటూ రోజాను ఆయన ఆపుతున్నారని సమాచారం. కానీ, రోజా మాత్రం ఏదోమమ అన్నట్లుగా ఓ క్షమాపణ అక్కడ పడేస్తే సభలోకి రావొచ్చు కదా అనే ఉద్దేశంతోనే ఉన్నారుట. 

నిజానికి రోజా మీద మళ్లీ సస్పెన్షన్ పడితే, ఆ నెపంమీద తెదేపాపై జగన్ ఎంతమేర బురద చల్లగలరో మనకు తెలియదు. కానీ.. రోజా సస్పెన్షన్ ఊసు లేకుండా సభకు వస్తూ ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ కే లాభం ఎక్కువ అనడంలో సందేహంలేదు. దూకుడుగా మాట్లాడడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్న రోజా సభలో అధికార పక్షాన్ని ప్రతిసారీ తూర్పారపట్టేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అలాంటి నాయకురాల్ని సభకు రానివ్వకుండా , కేవలం ప్రెస్ మీట్ లలో తిట్టడానికి మాత్రం పరిమితం చేయడం వల్ల వైకాపా బావుకునేది పెద్దగా ఉండదని, ఆమె సభకు వచ్చేలా క్షమాపణ చెప్పేందుకు అనుమతిస్తేనే జగన్ కు ఎక్కువ లాభం అని పలువురు అంటున్నారు. జగన్ ఈ విషయంలో తప్పుడు వ్యూహం అనుసరిస్తున్నారేమో అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.