Advertisement


Home > Politics - Political News
అన్సారీ 'ప్రేమ' ముస్లింలపైనా.? పదవిపైనా.?

ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీ కాలం నేటితో ముగియనుంది. పదేళ్ళపాటు ఉపరాష్ట్రపతిగా పనిచేశారాయన. అరుదైన గౌరవం దక్కించుకున్న హమీద్‌ అన్సారీ, ఎంత హుందాగా ఆ పదవిలోంచి తప్పుకుని వుండాలి.? పదవీ కాలంలో ఆయన ఎలా వ్యవహరించారన్న విషయం పక్కన పెడితే, పదవీ విరమణ సమయంలో మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తన స్థాయిని తగ్గించుకున్నారు హమీద్‌ అన్సారీ. 

'ముస్లింలకు దేశంలో భద్రత లేకుండా పోయింది..' అన్న ఒక్క మాటతో, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు హమీద్‌ అన్సారీ. సిగ్గు సిగ్గు.. అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారిప్పుడు. ఇలాంటి వ్యక్తినా మనం ఉపరాష్ట్రపతిగా గౌరవించాం.? అని జనం ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. అవును మరి, దేశంలో అసహన రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ బీజం వేస్తే, ఇప్పుడు హమీద్‌ అన్సారీ ఆ అసహనానికి ఆజ్యం పోశారు. 

ఓ రాజకీయ నాయకుడు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తేనే చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి వుంటుంది. అలాంటిది, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి, దేశంలో అసహనానికి కారణమయ్యేలా వ్యాఖ్యలు చేయడమంటే చిన్న విషయం కాదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, హమీద్‌ అన్సారీ వ్యాఖ్యలతో షాక్‌కి గురయ్యారు. రాజకీయ నేతల సంగతి తర్వాత, దేశ ప్రజానీకం అయితే హమీద్‌ అన్సారీలో ఈ కోణం కూడా వుందా.? అని విస్తుపోవాల్సి వస్తోంది. 

దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్‌ కలాంనే తీసుకుంటే. ఆయనెప్పుడూ తాను ఫలానా మతానికి చెందిన వ్యక్తినని చెప్పుకోలేదు. రాష్ట్రపతి పదవిలో కూర్చునప్పుడు ఎంత హుందాగా వున్నారో, పదవీ విరమణ చేసేటప్పుడు అంతకన్నా హుందాతనం ప్రదర్శించారు. 'కొన్ని కొన్ని పదవులు వ్యక్తుల్లో హుందాతనం పెంచుతాయి..' అన్న మాట బహుశా హమీద్‌ అన్సారీ విషయంలో వర్తించదేమో. 

'ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి.. దేశ పౌరులు భారతీయతను ప్రశ్నించడం ఇబ్బందికరమైన విషయం. జాతీయ వాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు..' అంటూ హమీద్‌ అన్సారీ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి.? నిజంగానే ఆయనకు ముస్లింలపై అంతటి ప్రేమ, మమకారం వున్నాయనుకోవాలా.? వుంటే, గడచిన పదేళ్ళలో ఎందుకు ఈ విషయమై పెదవి విప్పలేదు.? రాష్ట్రపతి పదవికి ప్రమోషన్‌ పొందాలనుకున్న హమీద్‌ అన్సారీకి, ఆ అవకాశం రాకపోవడంతోనే ఈ అసహనం అనుకోవచ్చా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. 

పదవికి వన్నెతెచ్చినవారిని మహనీయులంటాం.. ఆ పదవికి కళంకం తెప్పించినవారిని ఏమనాలి.?