Home > Politics - Political News
అసమర్థుల 'యుద్ధం' గెలుపెవరిది.?

పన్నీర్‌ సెల్వం.. పళనిస్వామి.. స్టాలిన్‌.. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఈ ముగ్గురి చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి.. ఇంకొకరేమో ప్రస్తుత ముఖ్యమంత్రి.. మరొకరేమో ప్రతిపక్ష నేత. రేపు తమిళనాడు అసెంబ్లీలో 'బలపరీక్ష' జరగనుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకుంటారా.? పళనిస్వామిని పన్నీర్‌ సెల్వం దెబ్బకొడతారా.? ఈ రాజకీయ యుద్ధంలో స్టాలిన్‌ పాత్ర ఏంటి.? ఇప్పుడీ ప్రశ్నలు తమిళనాడులో కంటే ఎక్కువగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 

జల్లికట్టు కోసం తమిళనాడు యువత రోడ్డెక్కింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి.. సుప్రీం కోర్టు తీర్పుకి భిన్నంగా జల్లికట్టుకి అనుమతి లభించింది. చిత్రంగా, తమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తి, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంటే ఆ యువత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఓ సంప్రదాయ క్రీడ మీద వున్న శ్రద్ధ, తమ భవిష్యత్తు మీద తమిళనాడు యువతకీ, అక్కడి ప్రజలకూ లేకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. గడచిన కొద్ది రోజులుగా తమిళనాడు రాజకీయాలే దేశంలో హాట్‌ టాపిక్‌. తమిళనాడులో మాత్రం ప్రజలు 'మాకేంటి సంబంధం.?' అన్నట్టుంది. 

ఇక, ఆ ముగ్గురి విషయానికొస్తే.. ముఖ్యమంత్రి పదవిని తన అసమర్థత కారణంగా చేజార్చుకున్న పన్నీర్‌ సెల్వం, ఇప్పుడు అదే పదవి కోసం పాకులాడుతున్నారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి దక్కించుకున్న పళనిస్వామిది ఇంకో కథ. నేరస్తురాలిగా నిరూపణ అయిన శశికళ ఎంపిక చేశారు పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి కోసం. 'చిన్నమ్మ' దయతో ముఖ్యమంత్రిగా బలం ప్రదర్శించగలిగితే, అట్నుంచటే పళనిస్వామి బెంగళూరు జైలుకి వెళతారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత ఏం చేయాలి.? చక్రం తిప్పి, అధికారం చేజిక్కించుకోవాలి. కానీ, ఆయనా చోద్యం చూస్తున్నారు. 

ఒక్కసారి తెలుగు రాజకీయాల్లోకి వద్దాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఇవే తరహా రాజకీయాలు నడిచాయి. జగన్‌, కాంగ్రెస్‌ పార్టీకి గండి కొడితే.. ఆ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలబెట్టారు. చంద్రబాబు, కూలదోద్దామనుకుంటే, జగన్‌ చేతులెత్తేశారు. అలా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే అత్యంత దారుణమైన సంఘటనలు అప్పట్లో జరిగాయి. ప్రస్తుతం తమిళనాడులోనూ దాదాపు ఇదే తరహా అసమర్థ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. 

కరెక్ట్‌గా చెప్పాలంటే, తమిళనాడులో ముగ్గురు అసమర్థుల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఎవరో ఒకరు గెలుస్తార్లే.. ఎవరు గెలిచినా, తమిళనాడుకి ఒరిగేదేమీ వుండదు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అనవసరం.