Home > Politics - Political News
బాబు - అమరావతి: మరో 'దసరా' ఈవెంట్‌

'చేపా చేపా ఎందుకు ఎండలేదు.?' అంటూ ఏడు చేపల కథలో చెప్పుకుంటుంటాం. 'అమరావతీ అమరావతీ నీ నిర్మాణమెందుకు జరగడంలేదు..' అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం నిరుత్సాహంతో కొత్త కథ చెప్పుకోవాలేమో.! 

ఎప్పుడో.. అంటే, దాదాపు రెండేళ్ళ క్రితం.. సరిగ్గా చెప్పాలంటే, 2015 అక్టోబర్‌లో విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. అదీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన అది.

ఈ 'ఈవెంట్‌' కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చాలా చాలా చాలా కష్టపడ్డారు. వివిధ దేశాలకు చెందిన అధినేతల్ని రప్పించాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో చంద్రబాబు పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నది నిర్వివాదాంశం. కోట్లు ఖర్చు చేసేశారు అమరావతి శంకుస్థాపన పేరుతో. 

ఇంతా చేసి, గడచిన రెండేళ్ళలో అమరావతిలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా.? అంటే, లేదాయె. చెప్పుకోవడానికి అమరావతిలో తాత్కాలిక సచివాలయ ప్రాంగణం మినహా ఇంకేమీ కొత్తగా నిర్మితమయ్యింది లేదక్కడ. అసెంబ్లీ, శాసనమండలితో కూడిన సచివాలయం మాత్రం, రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా కనిపిస్తోంది అమరావతిలో. అయితే, దానికి 'తాత్కాలికం' అని పేరు పెట్టేసి, ఆ 'ఘనత' చెప్పుకోడానికి కూడా వీల్లేకుండా చేసేశారు. 

రెండేళ్ళు పూర్తవుతోంది. మధ్యలో ఓ విజయదశమి వెళ్ళిపోయింది. కొత్తగా ఇంకో విజయదశమి వచ్చేస్తోంది. అందుకే, మరో ఈవెంట్‌ చేయడానికి చంద్రబాబు సర్కార్‌ సమాయత్తమవుతోంది. విజయదశమినాడు అమరావతిలో అధికారిక శాశ్వత నిర్మాణాల్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హుకూం జారీ చేసేశారు. ఆగస్ట్‌ 15 నాటికి పూర్తిస్థాయిలో డిజైన్లు ఫైనలైజ్‌ చేసెయ్యాలన్నది చంద్రబాబు 'డైరెక్షన్‌'. 

నిజమేనా, విజయదశమి.. అంటే సెప్టెంబర్‌ 30 నాటికి అమరావతిలో శాశ్వత అధికారిక నిర్మాణాలకు బీజం పడుతుందా.? చంద్రబాబు చెబుతున్నట్లుగా 2019 తొలి భాగం నాటికి.. అంటే 2019 ఎన్నికలకు ముందే అమరావతి తొలి దశ అందుబాటులోకి వస్తుందా.? లేదంటే, 2017 విజయదశమి కూడా జస్ట్‌ ఓ ఈవెంట్‌లా మిగిలిపోతుందా.? వేచి చూడాల్సిందే.