Advertisement


Home > Politics - Political News
బాబు కోసం వెంకయ్య.. చివరిదాకా.!

వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు.. ఇద్దరి మధ్యా అనుబంధం ఎంత గొప్పదో.! అసలు ఈ అనుబంధం గురించి చెప్పాల్సి వస్తే, అది ఎప్పటికీ తరగని వ్యవహారమేమో.! కేంద్రమంత్రిగా వున్న సమయంలో వెంకయ్యనాయుడు ఏ స్థాయిలో చంద్రబాబు భజన చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయంగా చంద్రబాబుకి మేలు చేసేందుకు వెంకయ్యనాయుడు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అతి త్వరలో అధికారికంగా ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోనున్నారు. ఈలోగా ఛాన్స్‌ వున్నంతమేర, చంద్రబాబు తరఫున వెంకయ్య 'ఎంత చెయ్యాలో అంతా' చేసెయ్యాలనుకుంటున్నట్టున్నారు. 

టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎప్పటినుంచో గవర్నర్‌ పదవి కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. టీడీపీ పట్ల మోత్కుపల్లి విరక్తి చెందిన సమయంలో 'గవర్నర్‌ పదవి' అనే మాటని ఎరగా వేశారు చంద్రబాబు. ఇది ఇప్పటి మాట కాదు, 2014 ఎన్నికల తర్వాత వచ్చిన మాట. మూడేళ్ళు పూర్తయిపోయింది.. అయినా, పాపం మోత్కుపల్లికి మోక్షం కలగలేదు. 'అదిగో, ఇదిగో..' అంటూ కేంద్రం నుంచి సంకేతాలొస్తున్నాయని చంద్రబాబు, మోత్కుపల్లిని మభ్యపెడుతూనే వచ్చారు. 

ఇక, తాజాగా వెంకయ్యనాయుడు, చంద్రబాబు మాటగా మరోమారు మోత్కుపల్లికి తీపి కబురు అందుతుందంటూ సెలవిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 'ఇంకానా, ఇప్పుడు కూడానా.. వెంకయ్య, చంద్రబాబు కోసం ఎంత కష్టపడుతున్నారో..' అని తెలంగాణ టీడీపీ నేతలే ఆశ్చర్యపోయారు. మోత్కుపల్లి సహా పలువురు తెలంగాణ టీడీపీ నేతలు, వెంకయ్యను కలిసిన సందర్బంలో ఈ 'గవర్నర్‌గిరీ' అంశం చర్చకు వచ్చింది. నిజమేనా.? ఎందుక్కాదు.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ వచ్చేశాయి కదా, అలాగే మోత్కుపల్లికి గవర్నర్‌గిరీ కూడా వచ్చేస్తుందనుకోవాలేమో.!