Advertisement


Home > Politics - Political News
ఎప్పుడూ 'క్రెడిట్‌' గొడవే...!

క్రెడిట్‌ గొడవంటే అప్పులకు సంబంధించిన తగాదా కాదండి. ఘనత, గొప్పదనానికి సంబంధించిన గొడవ. రాజకీయాల్లో క్రెడిట్‌కు ఎంతో ప్రాధాన్యముంది. మనం ప్రతిరోజు ఈ వ్యవహారం చూస్తూనేవున్నాం. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటూనే ఉంటారు. ఫలాన పని తాము మాత్రమే చేయగలిగామని, అద్భుతాలు చేస్తున్నామని, గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని/దేశాన్ని సర్వనాశనం చేస్తే తాము అధికారంలోకి వచ్చాక బాగుచేశామని... పాలకులు ఇలా నిరంతరం ఊదరగొడుతూనే ఉంటారు.

ఇందులో అతిశయోక్తులూ ఉంటాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల గురించి విపరీతంగా ప్రచారం చేస్తుంటాయి. టెక్నాలజీ, మీడియా ఇంతగా పెరిగిపోయినప్పటికీ ఏదో ఒక పేరుతో పాలకులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరుగుతుంటారు. పథకాలపై ఇంకా బాగా ప్రచారం చేయలని అధికారులపై, నాయకులపై ఒత్తిడి తెస్తుంటారు.

సరే..  ఇదిలా ఉంటే, కేంద్రం అనేక పథకాలను ప్రవేశపెడుతుంటుంది. వాటిని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ పథకాల అమలుకు కేంద్రం నిధులిస్తుంది. ఇక్కడే వస్తోంది అసలు గొడవ. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని పథకాలకు పేర్లు, రంగు, రుచి మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అప్పుడు జనం ఏమనుకుంటారు? రాష్ట్ర పాలకులు మంచి పథకాలు అమలు చేస్తూ ఎంతో మేలు చేస్తున్నారని, మళ్లీ ఈ అధికార పార్టీకే ఓటేస్తే ఇంకా మరిన్ని పథకాలు అమలు చేస్తారనుకుంటారు. కేంద్రం ఏమీ చేయడంలేదనే భావన కూడా కలుగుతుంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు పడని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కేంద్రం-రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతుంది. ఇదే 'క్రెడిట్‌' గొడవ.

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే సమస్య. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ కూడా ఉన్న విషయం తెలిసిందే. విచిత్రమేమిటంటే ఏపీలో టీడీపీ-బీజేపీ సంకీర్ణం ఉన్నప్పటికీ కేంద్ర పథకాల విషయంలో రెండు పార్టీల మధ్య పోరాటం సాగుతోంది. గత మూడున్నరేళ్లుగా ఉన్న ఈ సమస్య క్రమంగా పొత్తు విడిపోయేందుకు దారి తీసే అంశాల్లో ఒకటిగా ఉంది.

కేంద్ర పథకాలను చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ, కేంద్రం ఏమీ చేయడంలేదనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారని బీజేపీ నేతలు తగాదా పెట్టుకుంటున్నారు. తెలంగాణలోనూ ఇవే ఆరోణలు చేస్తున్నా, ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న కేంద్ర పథకాలపై మోదీ సర్కారు దృష్టి పెట్టింది.

కేంద్ర పథకాల అమలు తీరు, వాటికి అయిన వ్యయం, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం.. మొదలైన వివరాలు తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ లేఖ రాసింది. చిన్న పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన 'అమృత్‌' పథకాన్ని మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి పేరుతో అమలు చేస్తున్నారు. కాని చాలమందికి ఈ విషయం తెలియదు.

ఈ పథకాన్ని అమలుచేసిన ప్రాంతాల్లో పథకం లోగోను ఏర్పాటు చేయాలని, దాని ఖర్చు వివరాలు బోర్డుల మీద రాయాలని కేంద్రం ఆదేశించింది. ఏపీ విషయానికొస్తే రాష్ట్రాన్ని బతికిస్తున్నదే కేంద్రమేనని  బీజేపీ నాయకులు తేల్చిపారేస్తున్నారు. చంద్రబాబు ఏమీ చేయడంలేదని, మొత్తం కేంద్రమే చేస్తోందని, డబ్బు పూర్తిగా మోదీయే అందిస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో రాష్ట్ర పథకాల కంటే కేంద్ర పథకాలే ఎక్కువ అమలు జరుగుతున్నాయని, అయితే వాటిని రాష్ట్ర పథకాలుగా బాబు చెప్పుకుంటున్నారని కాషాయ పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే చంద్రబాబు ఏమీ చేయలేని స్థితిలో ఉండేవారని అంటున్నారు. కాని  కేంద్ర పథకాలకు సంబంధించిన పబ్లిసిటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు వాడటంలేదని మండిపడుతున్నారు.

గతంలో ఓసారి బీజేపీ చేసిన ఆరోపణల ప్రకారం.... కేంద్రానికి సంబంధించిన స్వచ్ఛ భారత్‌ పథకాన్ని ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రా అని మార్చారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రుణమాఫీ సాద్యమయ్యేది కాదు. రాష్ట్రానికి ఇరవైనాలుగు గంటల విద్యుత్‌ సరఫరా కేంద్రం చలవే. కేంద్రంలో ఇంకో పార్టీ అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యమయ్యేది కాదు.

కేంద్ర పథకాలు, కేంద్ర నిధుల కారణంగానే ప్రపంచ బ్యాంకు నివేదికలో ఏపీకి గుర్తింపు దొరికింది. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌ సిటీ పథకం పేరు తీసుకొని బాబు సర్కారు స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డు అని కార్యక్రమాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ అండియా అనగానే బాబు సర్కారు డిజిటల్‌ ఏపీ, స్కిల్‌ ఏపీ అని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా అమలు చేసుకోవడమే కాకుండా పేర్లు కూడా కాపీ కొట్టింది. చంద్రబాబుఇప్పటివరకు ఆయన ఏం చేశారు?.... ఇదీ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.