Home > Politics - Political News
చంద్రబాబు 'డిజైన్స్‌' మేనియా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అంటే ఎలా వుండాలి.? ప్రపంచంలో మేటి రాజధానుల్లో ఒకటిగా అమరావతి వుండి తీరాల్సిందే. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని.. ఇది ఓ అద్భుతమైన అవకాశం. అందుకే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది చంద్రబాబు ఉవాచ. ఆలోచన మంచిదే, కానీ.. ఆచరణకి 'చిత్తశుద్ధి' అవసరం కదా.! దురదృష్టవశాత్తూ ఆలోచన తప్ప, ఆచరణ గురించి ఆలోచించని 'ది గ్రేట్‌ అడ్మినిస్ట్రేటర్‌' చంద్రబాబుగారున్నారక్కడ. 

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి మూడేళ్ళు దాటేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడేళ్ళలో అమరావతికి ఏం చేశారు.? అంటే, అదిగదిగో తాత్కాలిక సచివాలయం.. అంతకు మించి ఏమీ కన్పించడంలేదక్కడ. ఇదిగో, ఇప్పుడు అమరావతికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్మాణాలు షురూ కానున్నాయట. డిజైన్లు ఈ రోజు ఫైనల్‌ అవుతాయి. అవి అసెంబ్లీ, హైకోర్టుకు సంబంధించినవి కావడం గమనార్హం. 

విజయదశమి నుంచే నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నది చంద్రబాబు సర్కార్‌ చెబుతున్నమాట. కాదు, విజయదశమికి శంకుస్థాపన చేసే అవకాశం వుందన్నది చంద్రబాబు సర్కార్‌ నుంచే వస్తోన్న ఇంకో వాదన.! 

నిజానికి, అమరావతిలో లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేసేశారు చంద్రబాబు. మొదటి శంకుస్థాపన సోలోగా చంద్రబాబు చేసేస్తే, ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీని తీసుకొచ్చి ఇంకో శంకుస్థాపన చేశారు. అంత పెద్ద ఈవెంట్‌కి వచ్చి కూడా, గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళతో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు షాకిచ్చారనుకోండి.. అది వేరే విషయం. రెండేళ్ళ క్రితం నాటి మాట అది. 

ఇంతకీ, అమరావతికి సంబంధించి తాజా డిజైన్లు ఫైనల్‌ అవుతాయా.? మళ్ళీ కొత్త డిజైన్లు కావాలంటూ చంద్రబాబు కొత్త కథ షురూ చేస్తారా.? కథలు విన్పించడానికే అవకాశం ఎక్కువగా కన్పిస్తోందిక్కడ. వందల కోట్లు, వేల కోట్లు అవసరం రాజధాని నిర్మాణానికి. ఆ స్థాయిలో నిధులు ఆంధ్రప్రదేశ్‌ ఖజానాలో అందుబాటులో లేవు. కేంద్రమేమో, చిల్లిగవ్వ కూడా విదల్చడంలేదాయె. మరెలా.? అందుకే, ఆ విషయం ది గ్రేట్‌ అడ్మినిస్ట్రేట్‌ చంద్రబాబుకి తెలుసు గనకనే, డిజైన్లతో సరిపెట్టేస్తున్నారు. 

2018 చివరి నాటికి తొలి దశ అమరావతి నిర్మాణం పూర్తయిపోతుందని చాలాకాలం క్రితం చంద్రబాబు సర్కార్‌ గర్వంగా చెప్పేసుకుంది. 2017 పూర్తయిపోతోంది. ఇంకో మూడు నెలలు మాత్రమే మిగిలి వుంది 2018 ఎంటర్‌ అవడానికి. రాజధాని అమరావతి పరిస్థితేంటి.? అని ఒక్కసారి ఆలోచిస్తే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చెప్పక తప్పదు.