Home > Politics - Political News
ఈ అరెస్టులు ఎక్కడిదాకా.?

మొన్న ఇంటూరి రవికిరణ్‌.. తాజాగా ఇప్పాల రవీంద్ర.. ఇకపై ఇంకెందరో.! అధికార పార్టీపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది వీరిపై మోపబడ్డ అభియోగం. సోషల్‌ మీడియా అన్నాక అన్నీ వుంటాయి. 'నేను చేస్తేనే సంసారం.. ఇంకెవ్వడు చేసినాసరే, అది వ్యభిచారమే..' అన్నాడట వెనకటికి ఒకడు. అధికార తెలుగుదేశం పార్టీ తీరు ఇలాగే తగలడింది.! 

నిజమే మరి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై, టీడీపీకి చెందిన అధికారిక సోషల్‌ మీడియా అక్కౌంట్లు, వెబ్‌సైట్లలోనే అత్యంత దారుణమైన కామెంట్లు, కార్టూన్లు దర్శనమిచ్చాయి. వాటిల్లో నూటికి తొంభై శాతం వ్యక్తిగత దూషణలే. తనదాకా వస్తేగానీ తలనొప్పి సంగతి తెలియదన్నట్లు.. టీడీపీ, సోషల్‌ మీడియా వేదికగా తమపైనా సెటైర్లు పడ్తుండడంతో తట్టుకోలేకపోయింది. అధికారం చేతిలో వుంది గనుక, ఎడా పెడా కేసులు పెట్టేసి, అరెస్టుల పర్వానికి తెరలేపింది. 

మొన్నీమధ్యనే 'పొలిటికల్‌ పంచ్‌' నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులు, తాజాగా బెంగళూరులో ఇప్పాల రవీంద్ర అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇంటూరి రవికిరణ్‌ విషయంలో నోటీసులు, విచారణ అనంతరం అరెస్టు.. ఇలా కాస్తో కూస్తో పద్ధతి పాటించారుగానీ, ఇప్పాల రవీంద్ర విషయంలో అవేమీ వున్నట్లు కన్పించడంలేదు. 

షరామామూలుగానే ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఇప్పాల రవీంద్ర అరెస్ట్‌ని ఖండించింది. ఆయనకు అండగా వుంటామని ప్రకటించింది. ఇంటూరి రవికిరణ్‌కి సంబంధించి లీగల్‌ వ్యవహారాల్ని చూసుకోవడమే కాకుండా, అవసరమైన ఖర్చులు భరిస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం విదితమే. ఇప్పాల రవీంద్రకీ అదే సాయం అందిస్తుందనుకోండి.. అది వేరే విషయం. ఇలా కేసులు పెరిగి, అరెస్టులు పెరిగితే.. వైఎస్సార్సీపీకి, ఈ తరహా వ్యవహారాలతోనే సరిపోతుంది సమయమంతా.! 

ఒక్కటి మాత్రం నిజం.. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని జీర్ణించుకోలేనంత 'డెలికేట్‌'గా చంద్రబాబు సర్కార్‌ తయారయ్యిందన్నమాట.!