Home > Politics - Political News
ఈ పదవి.. పగవాడిక్కూడా వద్దంతే.!

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో అత్యంత అధ్వాన్నంగా తయారైంది. పేరుకే ఆయన మంత్రి. అంతే తప్ప, ఆయనకు మంత్రిగా గౌరవం దక్కుతున్నదెక్కడ.? విశాఖ జిల్లాలో మరో మంత్రి గంటా శ్రీనివాసరావు పుణ్యమా అని అడుగడుగునా అయ్యన్నపాత్రుడికి అవమానాలే. సీనియర్‌ అన్న గౌరవం కూడా తన మీద చూపడంలేదంటూ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుపై గుస్సా అవుతుండడం తెల్సిన విషయమే. 

తన ఆవేదన, అక్కసు అన్నీ అప్పుడప్పుడూ వెల్లగక్కేస్తుంటారు అయ్యన్నపాత్రుడు. విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి నేరుగా గంటా శ్రీనివాసరావుపైనే అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఆ తర్వాత, చంద్రబాబు హెచ్చరికలతో అయ్యన్నపాత్రుడు రివర్స్‌ గేర్‌ వేసేశారనుకోండి.. అది వేరే విషయం. 

తాజాగా, మంత్రి అయ్యన్నపాత్రుడు 'అసలు మంత్రి పదవిలోకి ఎందుకు వచ్చానా.?' అని చింతించే పరిస్థితిని ఎదుర్కొన్నారు. అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు అయ్యన్నపాత్రుడు. ఏం లాభం.? ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆయన్ని ఆ కార్యక్రమానికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారట. 'నేను మంత్రినయ్యా..' అని చెప్పినా, 'ఎస్పీగారు ఒప్పుకోవడంలేదు' అని ఆ కానిస్టేబుల్‌ చెప్పాడట. ఇదంతా స్వయంగా అయ్యన్నపాత్రుడే సెలవిచ్చారు. 

'రాజకీయాల్లో వున్నాం కదా.. ఒక్కోసారి గౌరవం దక్కుతుంది.. ఒక్కోసారి అవమానం ఎదుర్కోవాలి.. అలవాటైపోయాయి అన్నీ..' అంటూ నిట్టూర్చారు మీడియా ముందు అయ్యన్నపాత్రుడు. ఆయన మాటల్లో, 'ఈ పదవి పగవాడిక్కూడా వద్దు..' అన్న భావన తొంగి చూసింది. నిజమే మరి, మంత్రి అని చెప్పినా కానిస్టేబుల్‌ కూడా తనను అనుమతించలేదంటే, ఆ పదవి ఎందుకు.. దండగే కదా.! ఇదంతా మంత్రి అయ్యన్నపాత్రుడు మీద చంద్రబాబు చూపుతున్న అదో టైపు 'అభిమానం' అంతే.!