Advertisement


Home > Politics - Political News
తెలంగాణలో గుత్తా... ఆంధ్రాలో బుట్టా...!

గుత్తా అంటే తెలంగాణలో కాంగ్రెసు ఎంపీగా ఉంటూ టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి. బుట్టా అంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీగా ఉంటూ టీడీపీలోకి జంప్‌ చేసిన బుట్టా రేణుక. ఈ ఇద్దరు ఫిరాయింపుదారుల గురించి చెప్పుకోవల్సిన పనేమిటి? వీరు చేసింది మెచ్చుకోదగిన గొప్ప పని కాదు. గత ఎన్నికల్లో ఆదరించి, ఎంపీ టిక్కెట్లు ఇచ్చి, గెలిపించిన పార్టీల నుంచి బయటకు వెళ్లిపోయి అధికార పార్టీ నుంచి ప్రయోజనాలు పొందారు.

మరి వీరిద్దరి మధ్య ఉన్న పోలిక ఏమిటి? రెండు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులు తాము ఎన్నికైన పార్టీలకు రాజీనామా చేయకుండానే గులాబీ, పచ్చ కండువాలు కప్పుకొని 'అధికార' ముద్ర వేయించుకున్నారు. నిజానికి ఇది నకిలీ ఫిరాయింపు మాత్రమే కాకుండా అనైతికం కూడా.

ఎన్నికైన పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిస్తేనే చేరిన పార్టీ తరపున ప్రజాప్రతినిధి అవుతాడు. కాని ఈ ప్రజాసామ్య దేశంలో ఈ అనైతిక చర్యపై ఏళ్లు గడుస్తున్నా చర్య తీసుకునే దిక్కు లేదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అప్పటివరకు బేఫికర్‌. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే ఎప్పుడైనా వేటు పడుతుండవచ్చని భయం ఉడటంవల్లనేమో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బుట్టా రేణుక పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేకుండా చేసుకున్నారు. మిగతావారంతా అధికార పార్టీ కండువాలు కప్పుకోగా, వీరు ఆ పని చేయలేదు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి కొంతకాలం కిందట కేసీఆర్‌ పరిపాలనకు ముగ్ధుడయ్యారు.

ఇలా ప్రేమ పెరగడానికి  కాంగ్రెసులోని తోటి నాయకులతో  విభేదాలే కారణం. ఏ కారణాలైతేనేం ఫిరాయింపుదారులు అనేకమంది చెప్పినట్లే కేసీఆర్‌ పరిపాలన బాగుందని, ఆయన బంగారు తెలంగాణ కోసం చేస్తున్న కృషిలో పాలు పంచుకోవడానికే  టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. షరా మామూలుగానే కాంగ్రెసు పార్టీ ద్వారా వచ్చిన తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. 'ఫిరాయింపు వేడుక'లో కనీసం గులాబీ కండువా కూడా కప్పుకోలేదు. అలా కప్పుకొని ఫొటోల్లో, వీడియోలో కనబడితే అనర్హత కేసులో అదొక సాక్ష్యంగా ఉంటుందని భయపడ్డారట....! ధైర్యంగా పార్టీ మారినప్పుడు ఈ భయం ఎందుకో తెలియదు.

సరే...కాంగ్రెసు పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేయకపోయినా కాంగ్రెసు నాయకుల, జనాల దృష్టిలో గుత్తా ఫిరాయింపుదారే. కర్నూలు వైకాపా ఎంపీ బుట్టా రేణుక కూడా ఇదే పని చేశారు. ఆమెతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్దకు వచ్చినవారు పచ్చ కండువాలు కప్పుకోగా రేణుక ఆ పని చేయలేదు. తాను టీడీపీలో చేరుతున్నట్లు అధికారికంగా చెప్పలేదని, బాబు చేస్తున్న అభివృద్ధికి ఆనందపడి ఆయనకు మద్దతు ఇస్తున్నానని చెప్పుకున్నారు.

తాను పార్టీ ఫిరాయించకపోయినా ఎందుకు సస్పెండ్‌ చేశారో అర్థం కాలేదని తెలివిగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తానన్నారు. తాను ఆ పార్టీకి అసోసియేట్‌ సభ్యురాలిగా ఉంటానన్నారు. తాను టీడీపీలో చేరలేదని రేణుక చెప్పుకోగా, పార్టీలో చేరిన రేణుకను స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలనుకున్నప్పడు గుత్తాను, బుట్టాను వదిలేస్తారా?