Advertisement


Home > Politics - Political News
హోదా సెగ: కమలనాథుల్లో అసహనం.!

ప్రత్యేక హోదా నినాదం ముదిరి పాకాన పడ్తుందా.? అదే నిజమైతే, ప్రత్యేక హోదా సెగని ఎలా ఎదుర్కోవాలి.? విభజనతో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురయిన దుస్థితి, ప్రత్యేక హోదా సెగతో బీజేపీకి ఎదురవుతుందా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఏపీ బీజేపీ నేతల్ని వెంటాడుతున్నాయి. నిన్న మొన్నటి పరిస్థితులు వేరు.. ఇప్పుడిప్పుడే మారుతున్న పరిస్థితులు వేరు.! 

ఒకప్పుడు వెంకయ్యనాయుడు, ఏపీలో భారతీయ జనతా పార్టీకి 'హోల్‌ అండ్‌ సోల్‌' అన్నట్లుగా వ్యవహరించేవారు. బీజేపీ మీద ఏ చిన్న విమర్శ వచ్చినా, తన వాగ్ధాటితో వెంకయ్య వాటిని తిప్పి కొట్టేవారు. ఇప్పుడా పరిస్థితి బీజేపీలో లేదు. పైగా, బీజేపీకి టీడీపీ నేతల నుంచీ ఇదివరకటిలా సపోర్ట్‌ కనిపించని పరిస్థితి. పోలవరం విషయంలోనూ ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ, రాష్ట్ర ఆర్థిక లోటు పూడ్చే విషయంలోనూ కేంద్రం సహకరించని వైనాన్ని చంద్రబాబే ఎత్తి చూపుతుండడంతో, ఈ సమయంలో ప్రత్యేక హోదా సెగని ఎదుర్కోవడం ఏపీ బీజేపీ నేతలకు అంత తేలికైన వ్యవహారం కాదు. 

నిన్న అనంతపురంలో వైఎస్‌ జగన్‌ యువభేరీ సదస్సు నిర్వహించడం, ఆ సదస్సులో ప్రత్యేక హోదా కోసం గళం విప్పడంతో, ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ప్రత్యేక హోదా అంశం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అంతే, మీడియా ముందుకొచ్చిన టీడీపీ, బీజేపీ నేతలు జగన్‌ని విమర్శించడమే పనిగా పెట్టేసుకున్నారు. ప్రెస్‌మీట్ల వ్యవహారం వేరు, మీడియాలో చర్చల వ్యవహారం వేరు. మాటకు మాట కౌంటర్‌ ఇవ్వాల్సిన పరిస్థితి చర్చా కార్యక్రమాల్లో వుంటుంది. ఆ సమాధానమే లేకపోయేసరికి, బీజేపీ నేతలు అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే, బీజేపీ నేతలు నేటి మీడియా చర్చా కార్యక్రమాల్లో పూర్తిస్థాయి అసహనాన్ని ప్రదర్శించడం గమనార్హం. 

ఒకాయన రెండున్నర లక్షల కోట్ల ప్యాకేజీ అంటాడు.. ఇంకొకాయనేమో ఐదులక్షల కోట్లకు పైనే ప్యాకేజీ అంటాడు.. చిత్రంగా బీజేపీ నేతల గొప్పలకి, టీడీపీ నేతలెవరూ వత్తాసు పలకడంలేదిప్పుడు. బహుశా చంద్రబాబు నుంచి డైరెక్షన్స్‌ ఆ స్థాయిలో వుండి వుండొచ్చుగాక. టీడీపీ, బీజేపీని వెనకేసుకురావడం మానేసింది. ప్రతిపక్షం వైఎస్సార్సీపీని విమర్శించడంలో మాత్రం ధాటి కొనసాగిస్తోందండోయ్‌.! 

మొత్తమ్మీద, యువభేరీ సదస్సుతో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా సెగ గట్టిగానే రాజేశారనుకోవచ్చు. ప్రధానంగా ఈ సెగ ప్రస్తుతానికి బీజేపీకే తగిలినా, ముందు ముందు టీడీపీ కూడా ఆ సెగ ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రత్యేక హోదాకి పాతరేసేశాం.. అని టీడీపీ, బీజేపీ నిన్న మొన్నటిదాకా సంబరపడినా, ఇప్పుడా సెగ ఆ రెండు పార్టీలకీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుండడం విశేషమే మరి.