Advertisement


Home > Politics - Political News
జగన్‌ దగ్గర 'ప్లాన్‌-బి' వుందా.?

న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకపోతే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఏం చేస్తారు.? 'వ్యక్తిగత హాజరు నుంచి ఆరు నెలలపాటు మినహాయింపు కావాలి' అంటూ న్యాయస్థానాన్ని జగన్‌ ఆశ్రయించనున్న దరిమిలా, ఇప్పటికే వాదనలు పూర్తికాగా, తీర్పు ఈనెల 23న రాబోతోంది. దాంతో, వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. 

జగన్‌ నవంబర్‌ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న విషయం విదితమే. పాదయాత్ర చేపట్టాలంటే, న్యాయస్థానం నుంచి వైఎస్‌ జగన్‌కి అనుమతి తప్పనిసరి. అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ ప్రధమ నిందితుడు. ప్రతి శుక్రవారం ఆయన న్యాయస్థానం యెదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సివుంది. పాదయాత్ర చేయాలంటే మాత్రం, వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్‌ జగన్‌కి మినహాయింపు దొరకడం తప్పనిసరి. మరి, కోర్టు జగన్‌ వాదన పట్ల సానుకూలంగా స్పందిస్తుందా.? ప్రస్తుతానికైతే ఇది సస్పెన్సే. 

'వాతావరణం సహకరించనప్పుడు పాదయాత్రను ఆపాల్సి వుంటుంది కదా.. అలాగే అనుకుని, వారంలో ఒకరోజు న్యాయస్థానం యెదుట హాజరై, మిగతా రోజుల్లో పాదయాత్ర చేసుకోండి..' అని న్యాయస్థానం జగన్‌ తరఫు లాయర్‌కి వాదనల సందర్భంగా సూచించిందనే ప్రచారం జరుగుతోంది. అంటే, వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కి మినహాయింపు దొరకడం కష్టమే. 

ఆరు రోజులు పాదయాత్ర చేసి, ఒకరోజు అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం న్యాయస్థానం యెదుట హాజరు కావడమంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వైఎస్సార్సీపీ పట్ల నెగెటివ్‌ సంకేతాలే వెళతాయన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. జగన్‌ పాదయాత్ర చేయాలంటే ఖచ్చితంగా, ఆయనకిప్పుడు 'ఊరట' న్యాయస్థానం నుంచి దక్కాల్సిందే. న్యాయస్థానం ససేమిరా అంటే మాత్రం 'ప్లాన్‌-బి' అమలు పర్చాలి. పై కోర్టుకి వెళ్ళడమే ఆ ప్లాన్‌-బి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! పాదయాత్ర అయితే మానేయడం కష్టమే మరి.!