Advertisement


Home > Politics - Political News
లెక్క‌లో లేని ఎల్కే అద్వానీ

అంతా అనుకున్న‌ట్టుగానే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ద‌ళిత కార్డును ప్ర‌యోగించింది బీజేపీ. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ళిత ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అనువుగా భావించి అందులో ద‌ళితుడినే కూర్చోబెట్టాల‌ని నిర్ణ‌యించింది.

బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాధ్ కోవింద్ ను ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ బాస్ అమిత్‌షా ప్ర‌క‌టించాడు. దీంతో స్వ‌తంత్ర భార‌తానికి మ‌రోసారి ఓ ద‌ళితుడు రాష్ట్ర‌ప‌తి కానున్నాడు. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి తీవ్ర నిరాశే మిగిలింది.

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర‌వాత దేశానికి తొట్ట‌తొలి రాష్ట్ర‌ప‌తిగా డాక్ట‌ర్ బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎన్నిక‌య్యారు. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు ప‌ద‌విలో కొన‌సాగారు. ఆ త‌ర‌వాత 1997లో కె.ఆర్ నారాయ‌ణ‌న్ ఎన్నిక‌య్యారు. ఆ స‌మ‌యంలో థ‌ర్డ్ ఫ్రంట్ త‌ర‌ఫున ఐ.కె గుజ్రాల్ ప్ర‌ధానిగా ఉన్నారు.

ఇప్పుడు తాజాగా బీజేపీ తాము ద‌ళిత ప‌క్ష‌పాతులం అని చెప్పుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో అణ‌గారిన వ‌ర్గాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని కూర్చోబెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ళిత ఓట్ల‌ను గంప‌గుత్త‌గా త‌మ‌కు ప‌డేలా చేస్తుంద‌ని బీజేపీ నేత‌లు గ‌ట్టిగా భావించారు. అందుకే బీజేపీలో హేమాహేమిల‌ను ప‌క్క‌న‌పెట్టి రామ్‌నాధ్‌కు అవ‌కాశం క‌ల్పించారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో సంపూర్ణ మెజారిటీ సాధించేందుకు ఎన్డీఏ కూట‌మికి కావాల్సినంత బ‌లం ఉంది. దీనికి తోడు ఎన్డీఏలో లేని వైసీపీ, టీఆర్ఎస్‌, ఎన్సీపీ, త్రుణ‌మూల్ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు అభ్య‌ర్థి పేరు చెప్తే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపాయి. ఇప్పుడు బీజేపీ ద‌ళిత నేత రామ్‌నాధ్ పేరు ప్ర‌క‌టించ‌డంతో విప‌క్ష పార్టీల‌న్నీ మ‌ద్ద‌తివ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

చివ‌రికి కాంగ్రెస్ కూడా రామ్‌నాధ్ అభ్య‌ర్థిత్వంపై తీవ్ర మంత‌నాలు సాగిస్తోంది. క‌మ్యూనిస్టులు కూడా రామ్‌నాధ్ ను వ్య‌తిరేకించే అవ‌కాశం లేదు. దీంతో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక దాదాపు ఏక‌గ్రీవంగానే క‌నిపిస్తోంది. ద‌ళితుడిని రాష్ట్ర‌ప‌తిని చేసిన ఘ‌న‌త బీజేపీ ఖాతాలో చేరనుంది. 

నరేంద్ర‌మోదీ హ‌వాతో జీవిత కాల కోరిక ప్ర‌ధాని ప‌ద‌విని కోల్పోయిన అద్వానీ రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఎంత చెడినా మోదీ త‌న శిశ్యుడే క‌దా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతాడా అని ఆశ‌ప‌డ్డాడు. కానీ మోదీ రాజ‌కీయాల ముందు అద్వానీ తేలిపోయాడు.

అద్వానీ అభ్య‌ర్థిత్వాన్ని విప‌క్షాల‌తోపాటు స్వ‌ప‌క్షంలోనూ చాలా మంది వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంది. అందుకే అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప‌క్షాల స‌మావేశంలో అద్వానీ పేరు మాట మాత్ర‌మైన చ‌ర్చ‌కు రాలేద‌ట‌.

సుష్మాస్వ‌రాజ్‌, స్పీక‌ర్‌ సుమిత్రా మ‌హ‌జ‌న్‌ల పేర్లు ప‌రిశీలించినా గ‌తంలో మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌తిభా పాటిల్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా వీరి అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకించార‌ట‌.