Advertisement


Home > Politics - Political News
మహా పాదయాత్ర కోసం 'మెగా ప్లానింగ్‌'

నవంబర్‌ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మహాపాదయాత్ర చేపట్టనున్న విషయం విదితమే. నిజానికి పాదయాత్ర ఈ నెలాఖరునే ప్రారంభం కావాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాలతో ఆ పాదయాత్రను నవంబర్‌ 2వ తేదీకి పోస్ట్‌పోన్‌ చేశారు. అయితే, న్యాయస్థానం నుంచి ఇంకా జగన్‌ మహా పాదయాత్రకు అనుమతి రావాల్సి వుంది.

ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి వైఎస్‌ జగన్‌, న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి వున్న దరిమిలా, ఆ హాజరు నుంచి మినహాయింపు కోసం ఇప్పటికే జగన్‌, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి తాను కోరుకున్న వెసులుబాటు తనకు తప్పక దొరికి తీరుతుందన్న నమ్మకంతో వున్నారు వైఎస్‌ జగన్‌. 

మరోపక్క, ఆరు నెలలపాటు సాగే ఈ మహా పాదయాత్ర కోసం పార్టీ శ్రేణులు విస్తృతమైన ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు, సుమారు 3 వేల కిలోమీటర్ల మేర సాగే మహా పాదయాత్రలో మొత్తం 120 నియోజకవర్గాలు కవర్‌ అవుతాయని వైఎస్సార్సీపీ చెబుతోంది.

మరో 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు వైఎస్‌ జగన్‌. పార్టీ అధినేత పూర్తిగా పాదయాత్రలో నిమగ్నమైపోతే, పార్టీ ముఖ్యమైన వ్యవహారాల సంగతేంటన్నదానిపైనా పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తాజాగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో హైద్రాబాద్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. 

జిల్లా కేంద్రాలతోపాటు, ముఖ్య పట్టణాల్లో అవసరమైనప్పుడు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా అప్పటికప్పుడు 'తక్షణ ఏర్పాట్లు' జరగాలని పార్టీ ముఖ్య నేతలకు వైఎస్‌ జగన్‌ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మహా పాదయాత్రకు ముందే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం సిద్ధమయిపోయినందున, పూర్తిస్థాయిలో అక్కడినుంచే పార్టీ కార్యక్రమాలూ జోరందుకోవాలని వైఎస్‌ జగన్‌ సూచించారట. 

ఆరు నెలల పాదయాత్ర సందర్భంగా వీలైనంత ఎక్కువమంది ప్రజల్ని కలిసేందుకు వీలుగా గ్రామాల స్థాయిలో, మండల స్థాయిలో కార్యకర్తలు ఏర్పాట్లు చేయాల్సి వుంటుందని జగన్‌ నేతృత్వంలోని ముఖ్య నేతల భేటీ తీర్మానించింది. మొత్తమ్మీద, న్యాయపరమైన చిక్కులు ఓ పక్క మహా పాదయాత్రపై అనుమానాల్ని పెంచుతున్నా, మహా పాదయాత్ర కోసం మెగా ఏర్పాట్లపై పార్టీ పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా వుందనే చెప్పాలి. 

మహా పాదయాత్రను చారిత్రక ఘట్టంగా మలచాలనే కసితో వున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అనుకున్నది సాధిస్తారా.? ఈ పాదయాత్ర వైఎస్‌ జగన్‌కి అధికారం తెచ్చిపెడ్తుందా.? అన్నిటికీ మించి మహా పాదయాత్రకు న్యాయపరమైన చిక్కులు రాకుండా వుంటాయా.? వేచి చూడాల్సిందే.