Advertisement


Home > Politics - Political News
మేయర్‌ పోస్ట్‌: లోకేష్‌ ముంచేశాడట.!

తండ్రికి తగ్గ తనయుడేనని నారా లోకేష్‌ నిరూపించేసుకున్నారు. కాకినాడలో ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థి విషయమై నారా లోకేష్‌, ఓ అభ్యర్థికి హామీ ఇచ్చారట. అయితే, చివరి నిమిషంలో ఈక్వేషన్స్‌ మార్చేసి, మేయర్‌ పదవిని సుంకర పావనికి కట్టబెట్టేసింది టీడీపీ అధిష్టానం. నమ్మించి గొంతు కోస్తారని ఊహించలేదంటూ మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న శేషుకుమారి మీడియా ముందు వాపోయారు. 

'మేయర్‌ పదవి ఇస్తామంటూ లక్షలు ఖర్చు చేయించారు.. నువ్వే మేయరంటూ ఏమార్చారు.. చివరికి, ఇదిగో ఇలా నన్ను ముంచేశారు..' అంటూ శేషుకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కార్పొరేషన్‌ కోసం ఆమె దాదాపు రెండున్నర కోట్ల దాకా ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. 'కనీ వినీ ఎరుగని రీతిలో పార్టీ కోసం ఖర్చు చేస్తే, నన్ను ఇంతలా అవమానిస్తారా.? మోసం చేస్తారా.? మంత్రి లోకేష్‌ కూడా మేయర్‌ పదవిపై హామీ ఇచ్చారు, మాట తప్పారు..' అని ఆరోపిస్తున్నారు శేషుకుమారి. 

ఈ తరహా వెన్నుపోట్లు తెలుగుదేశం పార్టీలో సర్వసాధారణమే. సరిగ్గా మేయర్‌ ఎన్నికలకు ముందు సుంకర పావని చక్రం తిప్పడంతో శేషుకుమారి ఆశలు గల్లంతయిపోయాయి. ఇప్పుడామె, పార్టీ తనను నిండా ముంచేసిందని వాపోతుండడంతోపాటుగా, పెద్దయెత్తున్న ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయానంటూ చేస్తోన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. 

మొత్తమ్మీద, మేయర్‌ ఎన్నిక పేరు చెప్పి చినబాబు నారా లోకేష్‌, సైతం తండ్రిబాటలోనే 'వెన్నుపోటు' రాజకీయాలకు తెరలేపడం విశేషమే మరి. యధా తండ్రి, తథా తనయుడు.. అంటే ఇదేనేమో.!