Advertisement


Home > Politics - Political News
మోడీ దెబ్బ: కోలుకోవడం అంత కష్టమా.?

దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్కరణలుగా పెద్ద పాత నోట్ల రద్దు అంశాన్నీ, జీఎస్‌టీ అమలు అంశాన్నీ నరేంద్రమోడీ సర్కార్‌ ప్రచారం చేసుకుంటోన్న విషయం విదితమే. పెద్ద పాత నోట్ల రద్దు ప్రకటన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలకీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకీ పొంతనే లేదు. దేశమంతా రోడ్డున పడిపోయింది పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయంతో. ఆ వెంటనే మరో పిడుగులాంటి సంస్కరణ జీఎస్‌టీని అమల్లోకి తీసుకొచ్చింది మోడీ సర్కార్‌. ఇదీ, దేశమ్మీద తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. 

'నిరాశావాదులే అలా మాట్లాడతారు.. దేశం వెలిగిపోవడం ఖాయం..' అని మొన్నీమధ్యనే నరేంద్రమోడీ, దేశ ఆర్థిక వ్యవస్థ బెంబేలెత్తిపోతోందంటూ వస్తున్న విమర్శలపై స్పందించిన విషయం విదితమే. జీడీపీ లెక్కలు, మోడీ వ్యాఖ్యలకు భిన్నంగా కన్పిస్తున్నా, కమలనాథుల బుకాయింపులు మాత్రం తగ్గడంలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక రంగ నిపుణులు, దేశం ప్రస్తుత పరిస్థితుల్లోంచి బయటపడాలంటే ఇంకో నాలుగైదేళ్ళయినా పడ్తుందని అంచనా వేస్తుండడం గమనార్హం. 

ప్రధానంగా ఉత్పాదక రంగం తీవ్రంగా ప్రభావితమైందనీ, ఉద్యోగ భద్రత అనుమానాస్పదంగా మారిపోయిందనీ, భవిష్యత్‌ గురించి ముందస్తు అంచనాలు, జాగ్రత్తలు లేకుండానే తొందరపాటు నిర్ణయాలతోనే ఈ దుస్థితి దాపురించిందని స్వదేశీ ఆర్థిక నిపుణులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆర్థిక నిపుణులూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచ బ్యాంకు సైతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా వుందనీ, తిరిగి మునుపటి స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడ్తుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు పేర్కొంటున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. 

స్మార్ట్‌ సిటీల గోల చల్లారిపోయింది.. మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ అటకెక్కిపోయింది.. నరేంద్రమోడీ దెబ్బకి రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా నిరుద్యోగం అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకునేలా కన్పిస్తోంది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడి, దేశం పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఇంకెంత సమయం పడ్తుందోగానీ, మోడీ 'అభివృద్ధి మందు' కొండ నాలిక కోసం వేస్తే, వున్న నాలిక ఊడిపోయేలా చేసిందనడం నిస్సందేహం.