Home > Politics - Political News
మోడీజీ.. కేటీఆర్‌ మాటలు వింటున్నారా.?

జీఎస్‌టీకి మొట్టమొదట మద్దతిచ్చింది తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటగా జీఎస్‌టీ బిల్లుని ఆమోదించింది. ఈ విషయంలో అందరికన్నా ముందుండాలన్న ఆలోచనతోనే అప్పటికప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్ని ఏర్పాటు చేసి, జీఎస్‌టీ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తద్వారా ప్రధాని నరేంద్రమోడీ మెప్పు కూడా పొందారాయన. 

కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవ్‌ కదా.! అందునా అక్కడున్నది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఎప్పుడు ఏ విషయమ్మీద ఆయన ఏ 'వాయిస్‌'తో మాట్లాడతారో ఊహించడం కష్టం. జీఎస్‌టీ విషయంలోనూ ఇప్పుడు కేసీఆర్‌ స్వరం మారింది. అప్పుడు కేంద్రానికి పూర్తి మద్దతిచ్చి, ఇప్పుడు జీఎస్టీ రేటు విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదీ నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు సంబంధించి కావడం గమనార్హం. 

కేసీఆర్‌ వాదనలు వింతగా వుంటాయి. అఫ్‌కోర్స్‌ ఆయన మాట్లాడే మాటల్లో లాజిక్‌ని ముందే ప్లాన్‌ చేస్తారనుకోండి.. అది వేరే విషయం. 'మేమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలూ జీఎస్‌టీ కొత్త పన్నుతో ఇబ్బంది పడతాయ్‌..' అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితి. కానీ, ముందుగా జీఎస్‌టీ బిల్లుకి ఆమోదం తెలిపినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తలేదు.? అన్న ప్రశ్న ఆటోమేటిక్‌గానే పుట్టుకొస్తుందని కేసీఆర్‌ ఊహించి వుండరు. 

జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని కేసీఆర్‌ అంటే, ఆయనగారి పుత్రరత్నం మంత్రి కేటీఆర్‌ ఓ అడుగు ముందుకేసి, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ప్రకటించడం గమనార్హం. సెప్టెంబర్‌ 9వ తేదీ వరకూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈలోగా తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించకపోతే 'యుద్ధం' తప్పదట. 

జీఎస్‌టీ బిల్లు పాస్‌ అయినప్పుడు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపటి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు కేంద్రంతో 'జీఎస్టీ రేటు'పై క్లారిటీ తెచ్చుకోలేకపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు ఏకంగా 'కేంద్రంతో పోరుబాట' అంటోంది. వింటున్నారా నరేంద్రమోడీజీ.!