Home > Politics - Political News
మోడీ మ్యాజిక్‌: రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌.!

కొత్త రాష్ట్రపతి ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవిద్‌ పేరుని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు.

రామ్‌నాథ్‌, ప్రస్తుతం బీహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నేతగా, న్యాయవాదిగా గతంలో పనిచేశారు రామ్‌నాథ్‌. బీజేపీ శ్రేణులు సైతం ఊహించని పేరిది. వ్యూహాత్మకంగా దళిత నేతని ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి పదవి కోసం ఎంపిక చేయడం విశేషమే. 

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, బీజేపీ సీనియర్‌ నేత - కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ.. ఇలా దాదాపు డజను మందికి పైగా వ్యక్తుల పేర్లు రాష్ట్రపతి ఎన్నికల రేసులో విన్పించాయి. వీటిల్లో చాలావరకు బీజేపీ లీకుల రూపంలో మీడియాకి అందించిన పేర్లే కావడం గమనార్హం. 

రాష్ట్రపతి ఎన్నికని ఏకగ్రీవం చేసే క్రమంలో బీజేపీ ఓ కమిటీని వేయడం, ఆ కమిటీ తరఫున వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలతో మంతనాలు జరపడం తెల్సిన విషయాలే. అయితే, అభ్యర్థి ఎవరన్నదీ చెప్పకుండానే ఈ చర్చలకు తెరలేపింది బీజేపీ.

'ముందు అభ్యర్థి ఎవరో చెప్పండి, ఆ తర్వాత ఆలోచిస్తాం..' అంటూ కాంగ్రెస్‌ సహా వివిధ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ బీజేపీకి ఝలక్‌ ఇచ్చాయి. అంతలోనే, ఎవరూ ఊహించని విధంగా రామ్‌నాథ్‌ కోవిద్‌ పేరుని ప్రకటించేసింది బీజేపీ. 

దళిత నేత కావడం, వివాద రహితుడు కావడంతో రామ్‌నాథ్‌ పేరుని వ్యతిరేకించేందుకు ఏ పార్టీ సుముఖత వ్యక్తం చేయడంలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రామ్‌నాథ్‌ కోవిద్‌ పేరుని బీజేపీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌నాథ్‌ కోవిద్‌కి మద్దతిస్తామని ప్రకటిస్తున్నారు కూడా.! 

మొత్తమ్మీద, విపక్షాలకు నరేంద్రమోడీ పెద్ద షాకే ఇచ్చారు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి. ఎన్నిక ప్రక్రియ లాంఛనమే గనుక, కాబోయే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌గా ఫిక్సయిపోవచ్చు.