Home > Politics - Political News
మోసగాడికి ఉరేసరి: వైఎస్‌ జగన్‌

తగ్గేదే లేదు.. ప్రజల్ని వంచిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని నడిరోడ్డు మీద కాల్చేసినా తప్పు లేదన్న వైఎస్‌ జగన్‌, ఈసారి మరింత ఘాటుగా చంద్రబాబుపై మండిపడ్డారు. 'చంద్రబాబుకి ఉరే సరి' అని తేల్చారు. ఉరేసినా తప్పు లేదంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారాయన. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక వేళ, వైఎస్‌ జగన్‌ - చంద్రబాబు విషయంలో పూర్తిస్థాయిలో 'అగ్రెసివ్‌'గా వ్యవహరిస్తుండడం గమనార్హం. 

ఆల్రెడీ, 'కాల్చెయ్యాలి..' అన్న మాటకిగాను, వైఎస్‌ జగన్‌ తాఖీదులు అందుకున్నారు. ఎన్నికల కమిషన్‌కి వివరణ కూడా ఇచ్చుకున్నారు. 'ఏదో ఆవేశంలో అనేశానుగానీ..' అంటూ వివరణ లేఖలో పేర్కొన్న వైఎస్‌ జగన్‌, మరోమారు ఆవేశకావేశాలకు లోనయ్యారు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఏం శిక్ష విధించాలి.? ఎన్నికల్లో హామీ ఇచ్చి, మాట తప్పిన వ్యక్తిని ప్రశ్నించకూడదంటే ఎలా.? ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, నిలదిస్తూనే వుంటామంటూ వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

వైఎస్‌ జగన్‌ ఈ స్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డంతో షరామామూలుగానే అధికార పార్టీ నుంచి జగన్‌పైకి విమర్శలు దూసుకొచ్చాయి. జగన్‌ది ఉన్మాద వైఖరి అనీ, ఎన్నికల కమిషన్‌ జగన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్‌కి, జగన్‌ తీరుపై మరోమారు ఫిర్యాదు చేస్తామన్నారాయన. 

మొత్తమ్మీద, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంతకు ముందెన్నడూ లేనంత ఆవేశకావేశాలకు గురవుతున్నారన్నది నిర్వివాదాంశం. ఇంకోసారి ఎన్నికల కమిషన్‌ నుంచి తాఖీదులు అందుకోవాల్సి వస్తే, 'తూచ్‌, ఏదో ఆవేశంతో అనేశానుగానీ..' అంటారా.? ఏమోగానీ, వైఎస్సార్సీపీ శ్రేణులైతే జగన ప్రసంగాలతో మరింత ఉత్సాహంతో ఊగిపోతున్నాయి. 

కొసమెరుపు: చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ విమర్శల వ్యవహారం నేషనల్‌ మీడియాకి కూడా ఎక్కుతోందండోయ్‌.!