Advertisement


Home > Politics - Political News
నంద్యాల బై పోల్‌: చాలా కాస్ట్‌లీ గురూ

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్షం వైఎస్సార్సీపీకీ మధ్యనే ప్రధానంగా 'పోరు' నడుస్తుండడంతో, ఇరు పార్టీలూ భారీగా శ్రేణుల్ని మోహరించాయి. ఓ వైపు టీడీపీ శ్రేణులు, ఇంకో వైపు వైఎస్సార్సీపీ శ్రేణులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలంటే మాటలా.? పచ్చనోటు లేనిదే పని పూర్తికాదాయె.! ప్రచారానికి జనాన్ని తరలించాలంటే పెద్దమొత్తంలో ఖర్చు చేయక తప్పదు. ఆ పర్వానికి ఎప్పుడో తెరలేచింది. 

ఒక రోజు ప్రచారానికి రేటు ఐదొందలకు పైనే పలుకుతోందట ఒక్కో వ్యక్తికి. ఇంకోపక్క, అర పూట ప్రచారానికీ రేటు ఫిక్స్‌ చేసేస్తున్నారు కింది స్థాయి నేతలు. అలా అడ్డా కూలీల్ని సైతం ప్రచారానికి తీసుకొస్తూ, అధికార పార్టీ అడ్డంగా కెమెరాలకు చిక్కేస్తోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే, గతంలోలా బహిరంగా డబ్బులు పంచే ట్రెండ్‌కి కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నాయి రాజకీయ పార్టీలు. డబ్బుల స్థానంలో టోకెన్లను మంజూరు చేయడం, ఆ టోకెన్లను 'పచ్చనోటుతో' రీడీమ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం. 

ప్రస్తుతానికి టీడీపీ నేతలు అలా 'టోకెన్లు' పంచుతూ, ప్రతిపక్షానికి చిక్కితే.. ప్రతిపక్షం పంచుతోన్న టోకెన్ల వ్యవహారంపై నిజాలు నిగ్గుతేల్చేందుకు అధికార పక్షం ప్రయత్నాలు షురూ చేసింది. తప్పదు మరి, ఏ రాజకీయ పార్టీ అయినా జనాన్ని తరలించాల్సిందే. స్వచ్ఛందంగా ముందుకొచ్చి, రాజకీయ పార్టీలకు జనం మద్దతిచ్చే రోజులెప్పుడో పోయాయ్‌.! 

మొత్తమ్మీద, ఈ ప్రచార ఆర్భాటాల కారణంగా, దినసరి కూలీల పంట పండుతోంది. 500 నుంచి 1000 రూపాయలదాకా దక్కుతోందని దినసరి కూలీలు చెబుతుండడం గమనార్హం. ప్రచారం సందర్భంగానే ఖర్చు ఈ స్థాయిలో వుంటే, ఓటు కోసం పంచే డబ్బు ఇంకెంతలా వుంటుందట.? అబ్బో.. నంద్యాల బై పోల్‌ చాలా కాస్ట్‌లీ గురూ అన్పించడంలేదూ.?