Home > Politics - Political News
నంద్యాల ఫైట్‌: వైఎస్‌ జగన్‌ ధైర్యం అదేనట

గడచిన పదమూడేళ్ళలో తెలుగుదేశం పార్టీకి నంద్యాలలో సీన్‌ లేదాయె. ఇదొక్కటే, నంద్యాలలో వైఎస్సార్సీపీ ఖచ్చితంగా గెలిచేస్తుందనడానికి నిదర్శనం అని ఆ పార్టీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కి, నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి అపనమ్మకం లేదు. గెలుపు పక్కా, మెజార్టీ మీదనే ఫోకస్‌.. అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్ని జగన్‌ ఉత్సాహ పరుస్తుండడం గమనార్హం. 

గడచిన పదమూడేళ్ళలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నంద్యాలలో గెలిస్తే, ఓ దఫా వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచినా, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి జంప్‌ చేసేశారు. ఆయన మరణంతో నంద్యాలలో ఉపఎన్నిక తలెత్తింది. భూమా అనుచరులు మినహాయిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్‌ టీడీపీలోకి వెళ్ళలేదన్న గట్టి నమ్మకంతో వున్నారు జగన్‌. 

నాయకుడికి నమ్మకం ముఖ్యం. నాయకుడిలో నమ్మకం ఎంత స్పష్టంగా కన్పిస్తే, పార్టీ శ్రేణుల్లో అంతగా ఉత్సాహం కన్పిస్తుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో జరుగుతోన్నది అదే. ఉప ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే అధికార పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపడం తమకు అనుకూలించే విషయమనీ, ప్రలోభాల పర్వమంటే అభద్రతా భావానికి నిదర్శనమేనన్నది వైఎస్సార్సీపీ వాదన. 

ముఖ్యమంత్రిపై జగన్‌ ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నా, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు టీడీపీ పాలనపై అదే స్థాయిలో విరుచుకుపడ్తున్నా.. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోందన్నది నిర్వివాదాంశం. ఈ సందడికి తోడు, సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపిన వైనంపై ఎప్పటికప్పుడు 'అప్‌డేట్స్‌' అందిస్తూ, గాలి తీసేస్తుండడం గమనార్హం. అందుకేనేమో, టీడీపీ నేతలు, వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న 'ప్రచారం'పై మరింత అసహనం వెల్లగక్కుతున్నారు. 

ఏది ఏమైనా, నంద్యాల ఫైట్‌లో వైఎస్సార్సీపీ గెలుపు అంత తేలికకాదు. అలాగని అసాధ్యమూ కాదు. మానసికంగా ఇప్పటికే టీడీపీపై వైఎస్సార్సీపీ పై చేయి సాధించింది. ఇందులో ఇంకో మాటకు తావులేదు. ఉపఎన్నిక ప్రకటనకు ముందు, తర్వాత పరిస్థితుల్ని బేరీజు వేస్తే, వైఎస్సార్సీపీకి ఎడ్జ్‌ బాగా పెరిగిందన్నది పార్టీకి అందుతోన్న ఫీడ్‌ బ్యాక్‌ సారాంశం. అందుకేనేమో, జగన్‌ తన ప్రసంగాలకి మరింత పదును పెడ్తున్నారు.. అధికార పక్షంపై మరింత ఘాటుగా విరుచుకుపడ్తున్నారు.