Home > Politics - Political News
నంద్యాల ఫైట్‌: డబ్బుల్లేవ్.. ఇవేం వేషాలో.!

మీకు తెలుసా.? నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడంలేదట. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ దగ్గర డబ్బు అసలే లేదట. దేవుడా.! రాజకీయాల్లో ఇలాక్కూడా జరుగుతుంటుందా.? 

ఎన్నికలంటే ఏంటి.? ఓట్ల పండగ.! ఆ పండగ వచ్చిందంటే, ఓటర్లను ప్రలోభాల ప్రవాహంలో ముంచెత్తేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అధికార పార్టీ ఒకింత ఎక్కువగా, విపక్షాలు ఒకింత తక్కువగా.. అంతే తేడా.! ఖర్చు అయితే మామూలే. మొన్నామధ్య ఓ పెద్దాయన, ఎమ్మెల్యేగా గెలవడానికి 11.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని సెలవిచ్చారు. 'పెద్దాయన' కదా, అందుకే ఆయన మీద కేసూ లేదు, ఇంకేమీ లేదు.! 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. రాజకీయాలు నడుస్తున్నది డబ్బుతోనే. డబ్బు ప్రవాహం అనేది లేకుండా ఎన్నికలు జరగడం అనేది అసాధ్యం. మద్యం ఏరులై పారాల్సిందే.. నోట్ల కట్టలు తరలి వెళ్ళాల్సిందే. ఈ ఉప ఎన్నిక అధికార పక్షానికి అత్యంత ప్రతిష్టాత్మకం. దాంతో, ఏ స్థాయిలో అయినా ఓటర్లను ప్రలోభపెట్టడానికి అధికార పార్టీ వెనుకంజ వేయదుగాక వేయదు. కానీ, అధికార పార్టీ అసలు ప్రలోభాల జోలికే వెళ్ళడంలేదనీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతూ ఓటర్ల దగ్గరకు వెళుతోందనీ అధికార పార్టీకి 'గెజిట్‌'లాంటి ఓ పత్రిక కథనాల్ని వండి వడ్డించేస్తోంది. 

ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఉప ఎన్నిక ఖర్చు 100 కోట్ల మార్క్‌ని టచ్‌ చేస్తుందట. ఈ ఉప ఎన్నికకి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి.! పైన చెప్పుకున్న 'పెద్దాయన' ఎవరో కాదు, అధికార పార్టీకి చెందిన వ్యక్తే. అలాంటప్పుడు, నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీ 'ఖర్చుపెట్టదు' అని ఎలా చెప్పగలం.? పైగా, 'ఓటుకి ఐదు వేలు నేను ఇవ్వలేనా.?' అంటూ ఇదే కర్నూలు జిల్లాలో మొన్నీమధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారాయె. 

అధికార పార్టీ సంగతి పక్కన పెడితే, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ డబ్బు ఖర్చు చేయదని జగన్‌ చెప్పినా అది హాస్యాస్పదమే అవుతుంది. పైగా, జగన్‌ తన దగ్గర 'అంత సొమ్ము లేదు' అనడాన్ని ఏమనుకోవాలి.? అధికార పార్టీ స్థాయిలో ఖర్చు చేయకపోవచ్చుగాక.. కానీ, ఎంతో కొంత ఖర్చు చేయకపోతే అది రాజకీయమెలా అవుతుంది.!