Advertisement


Home > Politics - Political News
నిప్పు థియరీ: పవన్‌కి జగన్‌ నచ్చలేదెందుకంటే..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరుడు.. అందుకే, పవన్‌కళ్యాణ్‌కి అస్సలేమాత్రం నచ్చలేదు.! అవును, ఈ విషయాన్ని స్వయంగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌, విశాఖలో కార్యకర్తల సమావేశంలో వెల్లడించారండోయ్‌. తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి, తానూ ముఖ్యమంత్రి అవ్వాలని జగన్‌ అనుకోవడం తనకు నచ్చలేదని పవన్‌కళ్యాణ్‌ సెలవిచ్చారు. ఈ తరహా రాజకీయాలు ప్రజలకు మేలు చేయవంటూ క్లాస్‌ తీసుకున్నారు పవన్‌కళ్యాణ్‌. 

అన్నయ్య చిరంజీవి నుంచి నటవారసత్వాన్ని అందుకున్న పవన్‌కళ్యాణ్‌, అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యూత్‌ వింగ్‌ యువరాజ్యం బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ 'వారసత్వం' రాజకీయాలపై అసహనం ఎందుకు వ్యక్తం చేయలేదో మరి.! తాను చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే డాష్‌ డాష్‌ అన్నాడట వెనకటికి ఒకడు. అచ్చం అలానే వుందిప్పుడు వ్యవహారం. 

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అవినీతిపరుడని పవన్‌కళ్యాణ్‌ సర్టిఫికెట్‌ ఇస్తే ఎలా.? కోర్టులు ఇంకా జగన్‌ని ఎక్కడా దోషి అని తేల్చలేదు కదా.! ఇది అచ్చంగా టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ స్క్రిప్ట్‌ని పవన్‌ పక్కాగా చదివి వినిపించేశారంతే. లేకపోతే, జగన్‌ అవినీతి పవన్‌కి కన్పించినప్పుడు, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు ఎందుకు కన్పించలేదట.? 

రాజకీయాల్లోకొచ్చినప్పుడు చంద్రబాబు ఆస్థులెంత.? ఇప్పుడు చంద్రబాబు ఆస్థులెంత.? ఈ విషయమై ఒక్కసారి పవన్‌ తనను తాను ప్రశ్నించుకుంటే, నారా చంద్రబాబునాయుడుగారి 'నిప్పు' రహస్యమేంటో అర్థమవుతుంది. కానీ, అంతలా పవన్‌ తనను తానెందుకు ప్రశ్నించుకుంటాడు.? ఛాన్సే లేదు. ఫ్రీగా అక్కడ చంద్రబాబు స్క్రిప్ట్‌ దొరుకుతోంటే, ఆ స్క్రిప్ట్‌ని పవన్‌కళ్యాణ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారాయె.! 

ఆర్నెళ్ళకో సంవత్సరానికో ఓసారి జనంలోకి వచ్చే పవన్‌కళ్యాణ్‌ నోట, వపర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగులు పేలుతుంటాయి. అంటే, అంతలా ఆ స్క్రిప్ట్‌ని ఆయన బట్టీపట్టేస్తాడన్నమాట. 2014 ఎన్నికల తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. 'కాగ్‌' కడిగి పారేస్తోంది.. విపక్షాల విమర్శల్ని పక్కన పెట్టేద్దామనుకున్నా.. పలు నివేదికలు, ఏపీని కరెప్షన్‌లో ముందు ప్లేస్‌లో పెట్టేశాయి. మరి, పవన్‌ - చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించరట.? ఇంకా పవన్‌కి చంద్రబాబు ఎందుకు నచ్చుతున్నారట.? జనానికి కాకపోయినా, కనీసం పార్టీ కార్యకర్తలకైనా పవన్‌ సమాధానం చెబితే బావుంటుందేమో.!