Home > Politics - Political News
నో డౌట్‌.. వ్యవసాయం దండగేనట

అది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న నాటి కాలం. వ్యవసాయం దండగని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, 'చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు.. దండగ కాదు, పండగ అని మేం నిరూపిస్తాం..' అంటూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా (ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో) పర్యటించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. అలా, వైఎస్‌ అధికారంలోకి వచ్చారు. ఉచిత విద్యుత్‌ని రైతులకి ఇచ్చి చూపించారు. 

'ఉచిత విద్యుత్‌ అంతా అబద్ధం..' అని ఆ తర్వాతా చంద్రబాబు గగ్గోలు పెట్టారుగానీ, ఉచిత విద్యుత్‌ ఇవ్వడం ద్వారా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ (ఉమ్మడి రాష్ట్రం) ప్రజల మెప్పు పొందారు. వరుసగా రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఉచిత విద్యుత్‌ దండగని చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఉచిత విద్యుత్‌కి జై కొట్టారు. వ్యవసాయం దండగన్న నోటితోనే, రైతులకు రుణమాఫీ ప్రకటన చేశారు 2014 ఎన్నికల ప్రచారంలో. 

కానీ, ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం, చంద్రబాబు దృష్టిలో 'దండగలా' మారిపోయింది. రెండు మూడు పంటలు ఏడాదికి పండే వ్యవసాయ భూముల్లో రాజధాని అమరావతిని నిర్మించ తలపెట్టారు చంద్రబాబు. చాలామంది రైతులు రాజధానికి భూములను ఇచ్చిన మాట వాస్తవం. అలా ఇచ్చే క్రమంలో రైతులు పడ్డ మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భాల్లో బెదిరింపులకు దిగడం ద్వారా ప్రభుత్వం తన బలాన్ని చాటుకుంది. ఎలాగైతేనేం, రాజధాని అమరావతి కోసం పెద్దయెత్తున భూముల్ని సమీకరించగలిగారు.. కొందరు మాత్రం భూముల్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 

ఇక, తాజాగా వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిథులు, అమరావతిలో పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు (టీడీపీ అనుకూలురు) వ్యవసాయం లాభసాటిగా లేదనీ, రాజధానికోసం తాము స్వచ్ఛందంగానే భూములు ఇచ్చామనీ చెప్పడం గమనార్హం.

అసలు అమరావతి పరిధిలో వరి పండేది చాలా తక్కువనీ తేల్చేశారు ఆ రైతులంతా. వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి నిధులు సమీకరించి, రాజధాని అమరావతిని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. అయితే, భూముల్ని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయని రైతులు వరల్డ్‌ బ్యాంక్‌కి జరుగుతున్న 'భూ దోపిడీ'పై ఫిర్యాదు చేయడంతోనే వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిథులు అమరావతికి రావడం గమనార్హం. 

ఒక్కటి మాత్రం నిజం.. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చంద్రబాబు మరోమారు వ్యవసాయం దండగని తేల్చేశారు.. ఆ మాట స్వయంగా రైతులతోనే చెప్పించేశారు. దటీజ్‌ చంద్రబాబు.