Advertisement


Home > Politics - Political News
ఎన్టీఆర్‌లో ఆ గాసిప్‌ ఉత్సాహం నింపిందా.?

జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడట.. ఇదిగో, పార్టీ పేరు.. అంటూ పార్టీకి సంబంధించిన లెటర్‌హెడ్‌ ఒకటి సోషల్‌ మీడియాలో సందడి చేసింది. అబ్బో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ పార్టీ షురూ చేసేశాడే.. అని కొందరు అనుకున్నారు. ఇంకొందరు కంగారుపడ్డారు కూడా. చాలామంది మాత్రం, ఇది జస్ట్‌ 'ఫేక్‌' అని కొట్టి పారేశారు. అవును, ఇదంతా జస్ట్‌ సోషల్‌ మీడియా ఫేక్‌ వ్యవహారం.! 

అయితే, కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడే మొదలయ్యింది. ఎందుకంటే, ప్రస్తుతానికి సినిమాల మీదనే ఫోకస్‌ వున్నా, తాత నందమూరి తారకరామారావు అడుగుజాడల్లో భవిష్యత్తులో ఎన్టీఆర్‌ రాజకీయంగా అడుగులేసే అవకాశాలైతే లేకపోలేదు. తాత స్థాపించిన టీడీపీ తరఫున, 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు కూడా. అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై, ప్రచారాన్ని పూర్తి చేయలేకపోయినా, మీడియా ద్వారా గాయాలతో ఉండగానే ప్రచారాన్నీ పీక్స్‌కి తీసుకెళ్ళే ప్రయత్నమైతే చేశాడు. అలా, ఎన్టీఆర్‌కి రాజకీయాలతో కాస్తో కూస్తో పరిచయం వుండనే వుంది. 

ఇక, ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ సంగతి సరే సరి. తండ్రి ఎన్టీఆర్‌ మరణానంతరం, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొచ్చి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించాడాయన. ఒకప్పుడు తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌కి రాజకీయాల్లో 'డ్రైవర్‌గా' వ్యవహరించిన హరికృష్ణ, ఆ మధ్య టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ఇలా ఎటు చూసుకున్నా, రాజకీయాలతో ఎన్టీఆర్‌కి దగ్గరి సంబంధాలే వున్నాయి. కాబట్టి, ఇప్పటికిప్పుడు రాజకీయ వార్తల్ని ఎన్టీఆర్‌ ఖండించేసినా, రైట్‌ టైమ్‌ చూసుకుని, రాజకీయ నేతగా తనను తాను ప్రొజెక్ట్‌ చేసుకునేందుకు అయితే ఎన్టీఆర్‌ వెనుకంజ వేయకపోవచ్చు. 

ఇదిలా వుంటే, ఎన్టీఆర్‌ కొత్త పార్టీ.. అనే వార్తలతో, కొందరు ఔత్సాహికులు ఆయనతో టచ్‌లోకి వెళుతున్నారట. కొత్త పార్టీ పెడుతున్నారా.? నిజమేనా.? అని, టీడీపీకి చెందిన నేతలే కొందరు ఎన్టీఆర్‌ వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తాజా పరిస్థితులు ఎన్టీఆర్‌లో కొత్త ఉత్సాహం నింపడమైతే ఖాయం.