Advertisement


Home > Politics - Political News
రాజమండ్రిలో పవన్: తికమక, మకతిక!

‘టీడీపీ, బీజేపీల హామీల అమలుకు పూచీ నాదీ అని గత ఎన్నికల సమయంలో చెప్పా...’ ‘ప్రత్యేకహోదా అంశమా.. నేను ఇంకా చిన్నవాడిని.. ఆ అంశం గురించి మాట్లాడలేను..’ ఈ రెండు మాటలూ చాలు.. రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రసంగం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవడానికి.

ఒకవైపు ప్రజారాజ్యం రెఫరెన్స్‌లు.. మరోవైపు తన చుట్టూ ఉన్న వాళ్లు తనను కేవలం నటుడిగానే చూశారని పవన్ వ్యక్తం చేసిన ఆవేదన.. మరోవైపు ప్రజారాజ్యంపై పడగలు ఎత్తారని.. కొంతమందిపై రీవేంజ్ మాటలు.. ఇలా కలగాపులగంగా.. తన రొటీన్ శైలిలోనే రాజమండ్రిలో కూడా ప్రసంగించి సెలవు తీసుకున్నాడు జనసేన అధినేత పవన్. 

రాజమండ్రిలో పవన్ మాట్లాడుతూ.. పరకాల ప్రభాకర్ పై ధ్వజమెత్తాడు. ఆరు నెలలు కర్రసాము చేసి మూలనున్న ముసలమ్మపై విరుచుకుపడినట్టుగా.. పరకాలను ప్రజారాజ్యం ద్రోహిగా అభివర్ణించాడు పవన్. ప్రజారాజ్యంపై ఆయన పడగలా విరుచుకుపడ్డాడట. ఇప్పుడు మాత్రం ఆయన రాష్ట్రం కోసం నిర్మలా సీతారామన్ చేత రాజీనామా చేయించడం లేదట.. ప్రజారాజ్యానికి, ప్రత్యేక హోదాకు భలే ముడిపెట్టాడు కదా.. దటీజ్ పవన్.

అలాగే పవన్ మరో విషయం కూడా చెప్పాడు. తనపై ఎవరైనా కాపు ముద్ర వేస్తే వాళ్ల అంతు చూస్తాను అని.. రాజకీయాల్లో విమర్శలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటికి చేతనైతే సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే ఊరికే ఉండాలి. అంతే కానీ.. ‘నన్ను గనుక అన్నారో..’ అనడం ఏమిటో మరి. పవన్‌ను ఎవరూ ఏమీ అనకూడదు. ప్రజారాజ్యం విలీనం గురించి విమర్శించకూడదు, టీడీపీ, బీజేపీ పాలన విషయంలో పవన్ ను ఎవ్వరూ ఏమనకూడదు, వాళ్లను ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పకూడదు.. ఇలా ఏదీ అనకూడదు.

ఆయన మాత్రం రఫ్ గా అందరి గురించి మాట్లాడేస్తూ ఉంటారు. వైఎస్ హయాంలో అవినీతి, జగన్ సీఎం కావాలని అనుకున్నాడు.. ఇలా అనే రైట్స్ పవన్ కు ఉంటాయి. చిరంజీవి పార్టీ పెట్టింది సీఎం కావాలని కాదా? 292సీట్లు గెలుస్తాం.. అని చెప్పింది నిజం కాదా? అంటే.. సీఎం కావాలనే కోరిక చిరంజీవికి మాత్రమే ఉండాలనమాట.. ఇదే పవన్ ఇస్తున్న జనసందేశం.

గట్టి ప్రశ్నలు వస్తే.. నేను చిన్నవాడిని, అసహాయుడిని, నిస్సహాయుడిని, పెద్దవాడిని కాను.. ఇలాంటి సమాధానాలు. ఇక వేమూరి రాధాకృష్ణ‌కు పవన్ గట్టి హెచ్చరికే చేశాడు. ‘నా చుట్టూ ఉన్నది కాపు యువత అని.. ఆయన రాశాడు. ఇప్పుడు నన్ను కాపు అంటున్నారే.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు నా కులం గుర్తుకు రాలేదా...?’ అని పవన్ అన్నాడు. మరి ఆంధ్రజ్యోతి అధిపతి తన వీకెండ్ కామెంట్లో పవన్ కు సమాధానం ఇస్తాడేమో చూద్దాం.