Home > Politics - Political News
పన్నీర్‌ సెల్వం.. పదిన్నొక్కటి

పది రోజులు ‘గోల్డెన్ టైమ్’ వచ్చినా, పాతిక మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడా చూపించలేకపోయారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం. జయలలిత మరణంతో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక చతికిలపడ్డ పన్నీర్‌ సెల్వం, కిందపడ్డా పై చేయి తనదేనంటున్నారు. చిత్రంగా, ఆయనకు ఇంకా 'మద్దతు' కన్పిస్తోంది. అయితే, అది వుండాల్సిన స్థాయిలో కాకపోవడమే గమనార్హమిక్కడ. 

పార్టీ నుంచి ఒకే ఒక్కడుగా బయటకొచ్చిన పన్నీర్‌ సెల్వం, 11 మంది ఎంపీల మద్దతును కూడగట్టడమంటే చిన్న విషయం కాదు. అదే సమయంలో ఆయనకు 10 మంది ఎమ్మెల్యేల బలం కూడా కలిసొచ్చింది. కానీ, ఏం లాభం.? ముఖ్యమంత్రి అవ్వాలంటే తక్కువలో తక్కువ 25 మంది ఎమ్మెల్యేలైనా కావాలి. అదీ, ప్రతిపక్షం డీఎంకే అప్పట్లో మద్దతిచ్చింది గనుక. అదీ చేతకాలేదు పన్నీర్‌ సెల్వంకి. 

ఇక, పన్నీర్‌ సెల్వం పనైపోయిందనుకునేంతలోపు ఓ ఎమ్మెల్యే ఆయనవైపుకొచ్చారు తాజాగా. దాంతో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల బలం పన్నీర్‌ సెల్వంకి లభించింది. రేపే తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆయన, తనకు 124 మంది ఎమ్మెల్యేల బలం వుందంటున్నారు. కానీ, అందులోంచి 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆ 40 మందీ పన్నీర్ సెల్వం వైపుకొస్తారట. అదెంత నిజమో, రేపటి బలపరీక్షలో తేలిపోతుందనుకోండి.. అది వేరే విషయం.

తాజా తమిళ పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏంటంటే, పన్నీర్‌ సెల్వం వర్గం - శశికళ వర్గాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం. సస్పెండ్‌ అయినవారిలో శశికళతోపాటు, ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా వుండడం గమనార్హం. ఆల్రెడీ అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌ సెల్వం అండ్‌ టీమ్‌ సస్పెండ్‌ అయిపోగా, అలా సస్పెండ్‌ అయిన పన్నీర్‌ టీమ్‌ ఇప్పుడు శశికళ వర్గాన్ని సస్పెండ్‌ చేయడమేంటట.? ఏమో మరి, అరవ రాజకీయాల్లో 'అతి'కి ఇది పరాకాష్ట అనుకోవాలంతే.!