Advertisement


Home > Politics - Political News
పవన్‌కళ్యాణ్‌కి 'అధికారం'పై యావలేదుగానీ.!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి 'అధికారం' మీద యావ లేదు. నిజమే మరి, 'అందని ద్రాక్ష' పుల్లన అంటారు కదా.! అలా పవన్‌కళ్యాణ్‌కి 'అధికారం' అందుకే బహుశా ఇష్టం లేదేమో.! ప్రజల తరఫున నిలబడటానికి అధికారం అవసరం లేదన్నది పవన్‌కళ్యాణ్‌ ఉవాచ. పవన్‌కళ్యాణ్‌కి అధికారం అక్కర్లేదు. కానీ, ఆయనగారికి అత్యంత సన్నిహితుడు చంద్రబాబుకి అధికారం కావాలి కదా.! అద్గదీ అసలు విషయం. చంద్రబాబుకి అధికారం కావాలి కాబట్టే, పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించారన్నమాట.! 

ఎప్పుడూ ఒకటే మాట.. ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌ని అభినందించి తీరాలి. పరోక్షంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని ఉద్దేశించి, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ విమర్శలు చేస్తుంటారు. తాజాగా, ముఖ్యమంత్రి అవ్వాలంటే అనుభవం కావాలని సెలవిచ్చారు పవన్‌కళ్యాణ్‌. ఈ 'అనుభవం' అన్న డైలాగ్‌ ఎక్కడో విన్నట్టుంది కదూ.! ఇంకెక్కడ, చంద్రబాబు నోట.. అదీ వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు చేయడానికి తరచూ వచ్చే మాటే ఇది. 

అబ్బే, పవన్‌ ఏది మాట్లాడినా.. దాన్ని జగన్‌తో లింక్‌ పెట్టడమేంటి.? అని కొందరు అనుకోవచ్చుగాక. కానీ, అక్కడ పవన్‌కళ్యాణ్‌ ఉద్దేశ్యం సుస్పష్టంగా కన్పిస్తోందాయె. అందరూ ఊహించిందే జరుగుతోంది. ఓ పక్క పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రచ్చ జరుగుతోంది. చంద్రబాబు అసెంబ్లీలో కేంద్రంపై విరుచుకుపడిపోయినంత పన్జేశారు. ఇంతలోనే, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ తెరపై ఇంకోస్సారి తళుక్కుమన్నారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ పేరుతో కేంద్రానికి పవన్‌ అల్టిమేటం జారీ చేయడం చంద్రబాబు స్కెచ్‌ కాక మరేమిటి.? 

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ గురించి ఎంతమందికి తెలుసు.? అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం అవగతమవుతుంది. దానికన్నా ముఖ్యమైన సమస్య విశాఖపట్నంలో వుంది. అదే రైల్వే జోన్‌. దశాబ్దాలుగా ఇక్కడ ప్రత్యేక రైల్వే జోన్‌ గురించి పోరాటం జరుగుతోంది. కానీ, అది పవన్‌కళ్యాణ్‌కి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే, చంద్రబాబు ఆ దిశగా పవన్‌ చేతికి స్క్రిప్ట్‌ అందించలేదు. అద్గదీ అసలు విషయం.