Home > Politics - Political News
పవన్‌కళ్యాణ్‌.. ఇది నిజమేనా.!

2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్తామనీ, ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పార్టీ పోటీ చేసి తీరుతుందని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ గట్టిగానే చెబుతున్నారు. అయితే, మొత్తం అన్ని సీట్లలోనూ పోటీ చేస్తారా.? కొన్ని సీట్లకే పరిమితమవుతారా.? ఏదన్నా రాజకీయ పార్టీతో పొత్తు వుంటుందా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. వాటికి సమాధానమివ్వడానికి జనసేన పార్టీకి సరైన యంత్రాంగమే లేని పరిస్థితి. 

ఇక, తాజాగా టీడీపీ వర్గాల నుంచి జరుగుతోన్న ప్రచారం చూస్తే, జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదట. '2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జనసేన పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే..' అని టీడీపీ నుంచి కొందరు నేతలు లీకులు అందిస్తుండడం గమనార్హం. ఈ లీకులే నిజమైతే, జనసేన పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుంటోన్నవారి పరిస్థితి ఏమవుతుందట.! 

టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జనసేన పార్టీ నడుస్తోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. చంద్రబాబు పిలిస్తే, పవన్‌కళ్యాణ్‌ తనకు ఎన్ని పనులున్నా మానుకుని మరీ వెళుతున్నారు. లేకపోతే, ఓ రాజకీయ పార్టీ పెట్టి, దాన్ని పూర్తిస్థాయిలో నిర్మించడానికి మూడేళ్ళ సమయం తీసుకోవడమా.? ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.! 

సోషల్‌ మీడియాలో ఓ కామెంట్‌, మీడియాకి ఓ ప్రెస్‌నోట్‌.. ఇదేనా రాజకీయం.? ఇంతకు మించి ఇంకేమీ లేదా.? అని జనం ఆశ్చర్యపోతున్నా, జనసేన రాజకీయ కార్యాచరణ మాత్రం మారడంలేదు. అసలంటూ రాజకీయ కార్యాచరణపై జనసేనకు ఓ ఐడియా వుంటే కదా.? ఏదిఏమైనా, 2019 ఎన్నికల్లో అసలు జనసేన పోటీ చేసే అవకాశమే లేదంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్‌కళ్యాణ్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చి తీరాల్సిందే.!