Advertisement


Home > Politics - Political News
పవన్‌కళ్యాణ్‌ కాదంటే ఔననిలే.!

నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీది తటస్థ వైఖరి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఈ విషయమ్మీద స్పష్టత ఇచ్చేశారు. 'ఎవరైనా నా ఫొటో పెట్టుకున్నా, నేను ఆ పార్టీకి మద్దతిచ్చానని చెప్పుకున్నా వారి మాటలు నమ్మొద్దు..' అని పవన్‌ చెప్పాక కూడా, తెలుగుదేశం పార్టీ మాత్రం 'పవన్‌కళ్యాణ్‌ మావాడే..' అంటోంది. 

2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ తమతో జత కట్టాడు గనుక, ఆయన ఔనన్నా కాదన్నా 2019 ఎన్నికల దాకా పవన్‌కళ్యాణ్‌ నైతిక మద్దతు తమకే వుంటుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు సెలవిచ్చారు. మరోపక్క భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక సైతం, పవన్‌కళ్యాణ్‌ పరోక్షంగా తమకు మద్దతు పలికినట్లేనని చెప్పేసుకున్నారు. ఈ దేబిరింత ఎందుకట.? ఇంకెందుకు, నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుస్తామా.? లేదా.? అన్న భయంతోనే. ఏ ఒక్క ఫ్యాక్టర్‌నీ వదులుకునే ఉద్దేశ్యం టీడీపీలో కన్పించడంలేదనుకోవాలేమో.! 

ఇక్కడ, పవన్‌కళ్యాణ్‌ తీరు కూడా అంత స్పష్టంగా లేదన్నది నిర్వివాదాంశం. మొదటి నుంచీ ఆయనది అనుమానాస్పద వైఖరే రాజకీయాల్లో. 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీలతో జతకట్టిన పవన్‌కళ్యాణ్‌, టీడీపీతోనూ, బీజేపీతోనూ అంటకాగినట్టే వుండడం, ఒక్కోసారి ఆ రెండు పార్టీలపైనా 'విసుర్లు' విసరడం, మళ్ళీ సందర్భానుసారం ఆ రెండు పార్టీలతో కలిసిపోవడం.. ఇదంతా గడచిన మూడేళ్ళుగా జరుగుతూనే వుంది. 

పైకి పవన్‌ ఏం చెప్పినా, తెరవెనుక మాత్రం తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లే కన్పిస్తోంది. లేకపోతే, కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించి పవన్‌కళ్యాణ్‌ అభిమానులు తమకు పూర్తి మద్దతిచ్చారని మంత్రి అఖిల ప్రియ సోదరి మౌనిక ఎలా చెప్పగలుగుతారు.? ఈ వ్యవహారంపై పవన్‌కళ్యాణ్‌ ఇంకోసారి క్లారిటీ ఇవ్వాలేమో.! ఇచ్చినా ఆ స్పష్టతని నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌ 'కాదంటే ఔననిలే' అని అర్థం వస్తుంటుంది మరి.