Advertisement


Home > Politics - Political News
ఫిరాయింపులపై చేతులెత్తేసిన జగన్‌

పార్టీ ఫిరాయింపుల్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆపలేకపోతోంది. ఈ విషయమై వైఎస్‌ జగన్‌ చేతులెత్తేశారు కూడా. 'ఏం చేయగలం.? నమ్మగలం అంతే.! నమ్మకం వున్నన్నాళ్ళూ ఇబ్బంది లేదు. నమ్మకం పోయిన నాడు ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే, అవతల నుంచి ప్రలోభాలు ఆ స్థాయిలో వున్నాయి. కొందరు నమ్మకద్రోహం చేస్తున్నారు. వారినీ ఏమీ అనలేం. మోసం చేశారనే బాధ ఆయా వ్యక్తుల విషయంలో కలుగుతుంటుంది..' అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌, పార్టీ ఫిరాయింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. 

నిజమే మరి, పార్టీ ఫిరాయించాలనుకుంటున్నవారిని జగన్‌ ఆపలేరు. అధికార పక్షం ప్రలోభాలకు నేతలు తలొగ్గుతున్నప్పుడు, జగన్‌ చేయగలిగింది కూడా ఏమీ లేదు. పది కోట్లు, పాతిక కోట్లు.. అంటూ అక్కడ వేలం పాటలు జరుగుతున్నాయి. వీటికి బెదిరింపులు అదనం. దాంతో, చేసేదేమీ లేక చాలామంది పార్టీ ఫిరాయించేస్తున్నారు. ఇప్పటికే 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీలోకి జంప్‌ చేసేశారు. పార్టీ ఫిరాయించిన ఎంపీల సంఖ్య మూడుకి చేరింది. 

కానీ, పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్‌ చాలా 'కసి'తో వున్నారు. అది ఆయన మాటల్లో స్పష్టంగా కన్పిస్తోంది. 'చూద్దాం, ఎప్పుడూ రోజులిలాగే వుండవ్‌ కదా.. ప్రజలు ఆశీర్వదిస్తే, దేవుడు దయతలిస్తే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం..' అంటూ భవిష్యత్తుపై దాదాపు ఓ క్లారిటీ ఇచ్చేశారు వైఎస్‌ జగన్‌. దానర్ధమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

ఇంకో ఏడాది, ఎలా గడుస్తుందా.? అని వైఎస్‌ జగన్‌ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారన్న విషయం ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఏడాది తర్వాత ఎన్నికలొస్తాయి. ఎన్నికలదాకా ఎందుకు.? ఈలోగానే, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయం. ఎందుకంటే, ఎన్నికలకు ముందే టిక్కెట్ల సందడి మొదలవుతుంది. అప్పుడే అసలు కథ షురూ అవుతుంది. 

కానీ, 2019 ఎన్నికల వరకూ వైఎస్సార్సీపీ ఇదే ఆత్మవిశ్వాసంతో వుంటుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 'ఇప్పుడు మిగిలిన 44 మందీ ఖచ్చితంగా నాతోనే వుంటారని భావిస్తున్నాను. నమ్మడం మినహా ఏమీ చేయలేను కదా.! వారిపైనా ఒత్తిడి చాలా తీవ్రంగా వుంది. కానీ, తట్టుకుని నిలబడ్తున్నారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నమైతే చేస్తున్నాను..' అని జగన్‌ అసలు విషయాన్ని బయటపెట్టేశారు. 

నిజమే, 2019 ఎన్నికలదాకా జగన్‌, ఇప్పుడున్న ఎమ్మెల్యేలని నిలబెట్టుకోవాల్సి వుంటుంది. ఒకరిద్దరు మైనస్‌ అయినా సమస్య వుండదుగానీ, అంతకన్నా ఎక్కువమంది కొత్తగా పార్టీ ఫిరాయిస్తే.. పరిస్థితి చెయ్యిదాటిపోతుందనడం నిస్సందేహం.