Advertisement


Home > Politics - Political News
ఇదో టైపు రాజకీయ సెంటిమెంట్‌...!

రాజకీయాల్లో, సినిమా రంగంలో చిత్రవిచిత్రాలు, సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్‌ అంటే ఓ విచిత్రమైన నమ్మకం. దానికి లాజిక్‌ ఉండదు. కాని భయపడుతుంటారు. కొన్ని సెంటిమెంట్లు సామాజికమైతే, ఎక్కువ వ్యక్తిగతంగా ఉంటాయి. హైదరాబాద్‌ సమీపంలోని చిలుకూరి బాలాజీ దేవాలయంలోని వెంకటేశ్వరస్వామి వీసా వెంకటేశ్వరుడుగా ప్రసిద్ధి. విదేశాలకు పోవాలనుకునేవారు అక్కడికి వెళ్లి మొక్కుకుంటారు. ప్రదక్షిణాలు చేస్తారు. సంతానం లేనివారు ఏదో ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. పెళ్లి కావల్సినవారు అందుకు ప్రసిద్ధి చెందిన ఆలయానికి వెళతారు. 

ఏదో ఒకదానికి ప్రసిద్ధమనే చెప్పకునే ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని అమరావతి పుణ్యక్షేత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు వెళ్లలేదని కొంతకాలం క్రితం ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే పదవి పోతుందనే సెంటిమెంటు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ తెలంగాణ కాంగ్రెసు నేత అమరావతికి వెళ్లి రాగానే పదవి పోయిందట.

దేవాదాయ శాఖ మంత్రిగా చేసినవారు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరని ఉమ్మడి రాష్ట్రంలో సెంటిమెంట్‌ ఉండేది. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంది. కృష్ణాజిల్లా రాజకీయ నాయకుల్లో బలంగా ఉన్న ఓ రాజకీయ సెంటిమెంట్‌ గురించి ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. అదేమిటంటే... ఎన్నికల్లో గెలిచి మొదటిసారి మంత్రి అయిన నాయకుడు (ఏ పార్టీ అయినా సరే) రెండోసారి ఎన్నికల్లో గ్యారంటీగా ఓడిపోతాడట...! ఇందుకు అనేకమందిని ఉదాహరణగా చూపిస్తున్నారు. సినిమా రంగంలోనూ ఇలాంటిదే ఉంది. కొత్త దర్శకుడి మొదటి సినిమా విజయం సాధిస్తే, రెండో సినిమా ఫ్లాప్‌ అవుతుంది. ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ ఇలా జరుగుతుందని కాదు, ఎక్కువసార్లు జరిగేసరికి సెంటిమెంటుగా స్థిరపడుతుంది.

ఇక రాజకీయ సెంటిమెంట్‌ విషయానికొస్తే 2019 ఎన్నికల్లో పోటీ చేయబోయే కృష్ణాజిల్లా మంత్రులకు సెకండ్‌టైమ్‌ సెంటిమెంట్‌ భయం పట్టుకుంది. ముగ్గురు మంత్రుల్లో దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఎక్కువగా భయపడుతున్నట్లు సమాచారం. సెకండ్‌టైమ్‌ సెంటిమెంట్‌ నుంచి తప్పించుకొని రెండోసారి గెలిచిన వ్యక్తి ఇప్పటివరకు సింహాద్రి సత్యనారాయణ ఒక్కరే.

ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు రెండోసారి ఎవ్వరూ గెలవలేదు. వడ్డె శోభనాద్రీశ్వరరావు, కొలుసు పార్థసారథి, నడికుడితి నరసింహారావు, దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ), కోనేరు రంగారావు, నెట్టెం రఘురామ్‌, మండలి బుద్ధప్రసాద్‌, పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎర్నేని సీతాదేవి... ఇలా అనేకమంది ఈ సెంటిమెంటుకు బలయ్యారు. 

కొందరు నాయకులు ఈ సెంటిమెంటును ట్రాష్‌ అంటూ కొట్టేస్తున్నారు. భయపడుతున్న ఉమాను, రవీంద్రను జాతకాలు చూపించుకొని పరిహారాలు చేయించుకోవాలని కొందరు సలహా ఇచ్చారు. సెంటిమెంట్లకు భయపడినా, భయపడకపోయినా ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే నాయకులు జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లకుండా ఉండరు. జాతకాలను కూలంకషంగా చూపించుకొని పూజలు, పరిహారాలు చేయించుకుంటారు. ఇలాంటివాళ్లు ఉంటేనే కదా జ్యోతిష్యులకూ ఆనందం...!