Home > Politics - Political News
ప్రత్యేక హోదా 'కాక' రేగిందిగానీ.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, కొంత గ్యాప్‌ తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. అనంతపురంలో పార్టీ నిర్వహించిన యువభేరీ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మాట్లాడారు. షరామామూలుగానే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నిజానికి, ప్రత్యేక హోదా అంశం కంటే ఎక్కువగా చంద్రబాబుని విమర్శించేందుకే వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. 

అందరికీ తెల్సిన విషయమే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమేనని. అదే సమయంలో, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఆంధప్రదేశ్‌లోని అధికారపక్షం మీద వుంది. అయితే, కేంద్రంలో - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ మిత్రపక్షాలు గనుక, ఆ రెండూ ప్రత్యేక హోదాని పాతరేశాయి గనుక, రెండిటిపైనా ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ జగన్‌ విమర్శలు చేయడం మామూలే. చిత్రంగా వైఎస్‌ జగన్‌, బీజేపీని విమర్శించేందుకే సాహసించలేదు. 

ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడే, గతంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. అసలు ఆయనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికి బీజేపీ ప్రతిపక్షంలో వుంది. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి అయ్యాక, ప్రత్యేక హోదా అంశాన్ని లైట్‌ తీసుకున్నారు. దాంతో పనే లేదని తేల్చేశారు. అలాంటి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు, వైఎస్‌ జగన్‌ తనవంతుగా కృషి చేసిన (మద్దతిచ్చిన) విషయాన్ని ఎలా మర్చిపోగలం.? మళ్ళీ ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హోదా నినాదాన్ని గట్టిగా విన్పిస్తానంటున్నారు. మంచిదే, అయితే ఆ నినాదం కేవలం చంద్రబాబుని విమర్శించడానికి మాత్రమేనా.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

ఎలాగైతేనేం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా 'కాక' కాస్త నెమ్మదిగానే అయినా రేగుతోంది. ముందు ముందు.. అంటే, 2019 ఎన్నికల నాటికి 'ఎన్నికల ప్రచారాస్త్రంగా' ఇది మారబోతోందన్నదీ నిర్వివాదాంశం. ప్రత్యేక హోదా విషయంలో ఎవరి గోల వారిదే. టీడీపీ అయితే ప్రత్యేక హోదా దండగని తేల్చేసింది. కాంగ్రెస్‌ పార్టీ సంగతి సరే సరి. ఆ పార్టీ ఎంత గట్టిగా నినదించినా ప్రయోజనం లేని పరిస్థితి. పవన్‌ పార్టీ జనసేన గురించి చెప్పుకోవడం దండగేమో.!