Home > Politics - Political News
క్విట్‌ ఇండియా - క్విట్‌ ఏపీ: వైఎస్‌ జగన్‌

బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టే క్రమంలో భారతీయులంతా 'క్విట్‌ ఇండియా' నినాదంతో ముందడుగు వేశారు. అది స్వాతంత్య్రం రాకమునుపు పరిస్థితి. ఆ 'ఉద్యమం' అప్పట్లో తెల్లదొరల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది. ఆ 'క్విట్‌ ఇండియా' ఉద్యమానికి సెల్యూట్‌ చేస్తూ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన 'పోస్టింగ్‌' చేశారు. 

క్విట్‌ ఇండియా ఉద్యమంతో ఎలాగైతే, బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టామో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా అదే స్ఫూర్తితో, 'మోసగాళ్ళారా, దోపిడీ పాలకులారా, ప్రజా వంచకులారా క్విట్‌ ఏపీ అని నినదించాల్సిన సమయం వచ్చింది..' అంటూ జగన్‌ చేసిన పోస్టింగ్‌ వైరల్‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నికల వేళ, వైఎస్‌ జగన్‌ - 'ముఖ్యమంత్రి చంద్రబాబుని కాల్చేసినా తప్పు లేదు' అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులకు వైఎస్‌ జగన్‌ స్పందించడం కూడా జరిగిపోయాయి. 

ఇక, ఇప్పుడు సోషల్‌ మీడియాలో 'క్విట్‌ ఇండియా - క్విట్‌ ఏపీ' అంటూ వైఎస్‌ జగన్‌ తెరపైకి తెచ్చిన కొత్త నినాదం ఇంకెలాంటి వివాదాలకు తావిస్తుందో వేచి చూడాల్సిందే. నంద్యాల ఉప ఎన్నికల వేళ వైఎస్‌ జగన్‌ ఎగ్రెసివ్‌నెస్‌, ఎంతమేరకు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందోగానీ, అధికారపక్షానికైతే మాత్రం జగన్‌ ఎప్పుడు ఏ బాంబ్‌ పేల్చుతారో తెలియక కంటి మీద కునుకు రాని పరిస్థితి తలెత్తిందన్నది నిర్వివాదాంశం.