Advertisement


Home > Politics - Political News
ధీమానా? అపనమ్మకమా?

సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నేతల వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు. వచ్చే ఎన్నికల్లోగా జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలుగాని, కొన్ని రాష్ట్రాల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలుగాని అన్ని పార్టీలకూ ప్రధానమే.

ముఖ్యంగా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి, కాంగ్రెసుకు ఇంకా ముఖ్యం. 'మొక్కే కదాని పీకితే పీక తెగుద్ది' అనే డైలాగ్‌ మాదిరిగా ఎంత చిన్న ఎన్నికైనా, అది ఉప ఎన్నికైనా సరే ప్రచారంలో నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికలపై దాని ప్రభావం పడుతుందనే భయం ప్రధాని మోదీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఉంది. కాని కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఈ భయం లేదా?

మోదీ ప్రధాని పదవిలో ఉండి కూడా ఉప ఎన్నికలను సైతం పెద్ద ఎన్నికల మాదిరిగా పరిగణిస్తుండగా, ఉప ఎన్నికలే కదాని రాహుల్‌ నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ప్రతి ఎన్నికల్లో తీవ్రంగా, అలుపు సొలుపు లేకుండా మోదీ ప్రచారం చేస్తున్న తీరును చూస్తున్నాం. ఈమధ్య జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులను, ప్రధాన నాయకులను భారీగా బరిలోకి దింపి ప్రచారం చేశారు. ఇప్పుడు విషయమేమిటంటే...ఈ నెల (జనవరి) 29న రాజస్థాన్‌లోని రెండు లోక్‌సభ  స్థానాలకు, ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇది బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రం కావడంతో సహజంగానే అధికార పార్టీ ఈ స్థానాలు గెలుచుకోవాలనుకుంటుంది. ఇవి ఉప ఎన్నికలే అయినప్పటికీ బీజేపీ భారీ ప్రచార బృందాన్ని రంగంలోకి దింపుతోంది. ఇందులో స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గద్కరీ, రాష్ట్ర మంత్రి గులాబ్‌చంద్‌ కటారియా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ పర్నమి పాల్గొనబోతున్నారు. ఉప ఎన్నికలు జరగబోతున్న అజ్మీర్‌, అల్వార్‌ లోక్‌సభ స్థానాలు, మండల్‌ఘర్‌ అసెంబ్లీ స్థానం రాజకీయంగా కీలకమైనవి. ఈ మూడు స్థానాలూ అధికార పార్టీవే. అందులోనూ రాజస్థాన్‌ అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ మూడు నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని కాంగ్రెసు పార్టీ చెప్పుకుంటున్నప్పటికీ రాహుల్‌ ప్రధాన ప్రచారకర్తగా ఎందుకు ప్రచారానికి రావడంలేదనేది కీలక ప్రశ్న. కాబోయే ప్రధానిగా చెప్పుకుంటున్న, మోదీని దీటుగా ఎదుర్కొంటున్న రాహుల్‌ ప్రచారానికి రాకున్నా బీజేపీ భారీగా బృందాన్ని దింపుతోంది. తాను స్టార్‌ క్యాంపెయినర్‌గా రాకపోయినా కాంగ్రెసు గెలుస్తుందని రాహుల్‌ గాంధీ ధీమాగా ఉన్నారో, ప్రచారం చేసినా గెలిచే అవకాశం లేదనుకున్నారో తెలియడంలేదు. ఎన్నికల ప్రచారంలో మధ్యలో వచ్చి నామమాత్రంగా ప్రచారం చేస్తారా?