Home > Politics - Political News
రైలు ప్రమాదాలూ, లక్ష కోట్లు.. మోడీజీ అద్భుతః

రైలు ప్రమాదమంటూ జరిగితే, ఠక్కున రాజకీయ నాయకులకు గుర్తుకొచ్చే మాట 'రైల్వే మంత్రి రాజీనామా చేయాలి' అనే. కాలం మారింది. ఇప్పుడెవరూ రైల్వే మంత్రిని రాజీనామా చేయాలనడం లేదు. ఎందుకంటే, అలా డిమాండ్‌ చేసి ఉపయోగం లేదు కాబట్టి.! నెల రోజుల్లోనే ఐదు రైలు ప్రమాదాలు.. ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ ట్రాక్‌ రికార్డ్‌. ట్రాక్‌ మీద వెళ్ళాల్సిన రైళ్ళేమో, ట్రాక్‌ మారి ప్రమాదాల బారిన పడ్తోంటే, నరేంద్రమోడీ సర్కార్‌ బుల్లెట్‌ రైళ్ళ పేరుతో విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. 

గరిష్ట వేగం 150 కిలోమీటర్లకు చేరుకోలేకపోతోంది మన రైల్వే వ్యవస్థ. నిజానికి, ఇక్కడ మన రైల్వే వ్యవస్థని తప్పుపట్టలేం. ప్రపంచంలోనే మేటి రైల్వే వ్యవస్థల్లో మనదీ ఒకటి. దురదృష్టవశాత్తూ పాలకులే రైల్వే వ్యవస్థతో ఆటలాడేసుకుంటున్నారు. వాళ్ళూ, వీళ్ళూ అన్న తేడాల్లేవు.. ప్రయాణీకుడి జేబులకెలా చిల్లు పెట్టాలన్న ఆలోచనలు తప్ప, రైల్వే రంగాన్ని అత్యున్నతస్థాయి ప్రమాణాలతో, అత్యంత భద్రత కలిగిన వ్యవస్థగా తీర్చిదిద్దడమ్మీద శ్రద్ధ పెట్టడంలేదు.

లక్ష కోట్లు ఖర్చు చేసి దాదాపు 500 కిలోమీటర్ల పొడవున బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది నరేంద్రమోడీ సర్కార్‌. ఇది ప్రధాని నరేంద్రమోడీ కల. కలలు కనడం తప్పు కాదు, వాటిని సాకారం చేసుకోవాలనుకోవడం అసలే తప్పు కాదు. కానీ, ప్రస్తుతం మన రైల్వే రంగం పరిస్థితేంటి.? అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా.! ఆ ఆలోచనే పాలకులకు వుంటే ఇకనేం.. భారతీయ రైల్వే 'బుల్లెట్‌' అద్భుతాల్ని ఎప్పుడో సృష్టించేసేది. 

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా బుల్లెట్‌ రైలుని తీసుకోవడం అభినందించదగ్గ విషయమే. కానీ, ఓ వైపు మన రైల్వే వ్యవస్థ, ఇంకోపక్క మెట్రో ప్రాజెక్టులు.. అభాసుపాలవుతున్నాయి. వాటి మాటేమిటి.? గంటకు 150 కిలోమీటర్ల వేగంతో రైళ్ళు నడపలేకపోతున్న మనం, గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్ళను నడిపేయాలనుకోవడం, ఇందుకోసం లక్ష కోట్లు తగలేసెయ్యడం సమంజసమేనా.?