Advertisement


Home > Politics - Political News
రేవంత్‌రెడ్డి ప్రశ్నలకి టీడీపీ దగ్గర జవాబులేవీ.?

తెలంగాణ టీడీపీలో ఇప్పటిదాకా ఒకే ఒక్కడు.. అతనే రేవంత్‌రెడ్డి. 2014 ఎన్నికల తర్వాత, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో 'కాపాడుకుంటూ' వచ్చింది ఎవరన్నా వుంటే, అది రేవంత్‌రెడ్డి మాత్రమే. చంద్రబాబు బ్రీఫింగ్‌ చేస్తే, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యింది కూడా రేవంత్‌రెడ్డే. అయినాసరే, పార్టీ కోసం గట్టిగా నిలబడ్డాడాయన. ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా, చంద్రబాబు నమ్మినోళ్ళంతా పార్టీని వీడుతున్నా, రేవంత్‌రెడ్డి మాత్రం టీడీపీని 'గట్టిగా పట్టుకుని' వున్నారన్నది నిర్వివాదాంశం. 

కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్‌ మారాయి. రేవంత్‌రెడ్డి, టీడీపీని వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి, ఆ పరిస్థితుల్ని కల్పించింది ఇంకెవరో కాదు, టీడీపీ అధినేత చంద్రబాబే. 'ఇరుగు పొరుగు రాష్ట్రాల సఖ్యత' పేరుతో చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సరెండర్‌ అయిపోయిన తీరు దగ్గర్నుంచి, పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ని ఫాలో అవడం వరకూ.. చాలా విషయాల్లో, టీఆర్‌ఎస్‌ని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించలేని స్థితికి తీసుకొచ్చేసింది చంద్రబాబు మాత్రమే. 

రేవంత్‌రెడ్డి దగ్గర ఈ విషయంలో ప్రశ్నలు చాలానే వున్నాయి, టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద మాత్రం ఒక్క ప్రశ్నకీ సమాధానముండదు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీడీపీ చాలా పోరాటాలే చేసింది. ఆ పోరాటాలకు రేవంత్‌రెడ్డి నాయకత్వం వహించారు. కానీ, ఏం లాభం.? ఏపీలో చంద్రబాబు 'రాజకీయ వ్యభిచారాన్ని' (అదేనండీ, చంద్రబాబు మాటల్లో పార్టీ ఫిరాయింపు అంటే రాజకీయ వ్యభిచారమే కదా) ప్రోత్సహిస్తూ వచ్చారు. దాంతో, పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ టీడీపీ పోరు వృధా అయ్యింది మరి.! 

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు కాంట్రాక్టులు పొందారన్నది రేవంత్‌రెడ్డి ఆరోపణ. తెలంగాణలో చాలామంది తెలంగాణ వాదులు ఇప్పటిదాకా సంధిస్తున్న ప్రశ్నే ఇది. తెలంగాణలో ఏపీకి చెందిన ముఖ్యులకు కాంట్రాక్టులు దక్కుతున్నాయని. అలా కాంట్రాక్టులు దక్కించుకుంటున్నవారు టీడీపీ నేతలే అయినప్పుడు, తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ని ప్రశ్నించగలరా.? ఛాన్సే లేదు. 

'మమ్మల్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేధిస్తోంది.. అలాంటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధినేత కేసీఆర్‌కి ఏపీ మంత్రులు, ఇతర నేతలు వంగి వంగి దండాలు పెడతారా.?' అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించడం గమనార్హం. నిజమే మరి, ఏపీలో కేసీఆర్‌ పర్యటించిన రెండు సందర్భాల్లోనూ విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆ పుణ్యం కట్టుకున్నదీ టీడీపీ నేతలే కదా.! 

మొత్తంగా చూస్తే, కేసీఆర్‌ని తెలంగాణలో విలన్‌గా చూపించేందుకు తెలంగాణ టీడీపీ కష్టపడ్తోంటే, ఏపీలో కేసీఆర్‌ని హీరోగా చూపించడానికి టీడీపీ నేతలు ఆరాటపడ్తున్నారు. ఇది రేవంత్‌రెడ్డికి, 'ఎక్కడో బాగా కాలిపోయేలా' చేసిందన్నది నిర్వివాదాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు తెలంగాణలో టీడీపీని పాతరేసేశాయి. మరీ ముఖ్యంగా, రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేశారు చంద్రబాబు. సో, రేవంత్‌రెడ్డి తన దారి తాను చూసుకోవడం తప్పేంటట.?