Advertisement


Home > Politics - Political News
రోజాతో ఇంకాస్త తిట్టించుకోవాలని..

'నువ్వూ ఓ మహిళవేనా.? సాటి మహిళ వస్త్ర ధారణ గురించి అసభ్యకరంగా మాట్లాడతావా.? సినిమాల్లో నువ్వు వేసిన బికినీలేంటి.? నువ్వు చేసిన ఎక్స్‌పోజింగ్‌ ఏంటి.?' అంటూ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై దుమ్మెత్తి పోసేస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ. మంత్రి అఖిలప్రియ వస్త్రధారణపై రోజా పెదవి విరచడంతోనే ఈ వివాదం షురూ అయ్యింది. 

అఖిలప్రియ విషయంలో రోజా వ్యాఖ్యలపై టీడీపీ నిన్న మొన్నటిదాకా తీవ్రస్థాయిలో మండిపడినా, ఇప్పుడు స్వరం మార్చింది. 'రోజా తీరుతో మాకు లాభమే తప్ప, నష్టం లేదు.. రోజా మాటల్ని ఎవరూ పట్టించుకోరు సరికదా, ఆమె చర్యల కారణంగా వైఎస్సార్సీపీకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం వుంది..' అంటూ టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

అంటే, 'రోజమ్మా, ఇంకాస్త గట్టిగా తిట్టమ్మా..' అని టీడీపీ నేతలే రిక్వెస్ట్‌ చేస్తున్నట్టుంది కదూ.! రాజకీయాల్లో అంతే, ఏ సిట్యుయేషన్‌ని అయినా తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. అఖిలప్రియపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో వైఎస్సార్సీపీకి రోజా కొంత నష్టం చేసిన మాట వాస్తవమే. 'నైటీ వేసుకుని క్యాబినెట్‌ మీటింగ్‌కి వెళ్ళు.. నాకేం అభ్యంతరం.?' అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. 

ఆ తర్వాతే రోజా వాయిస్‌లో కొంత తేడా వచ్చింది. చంద్రబాబుపై వాగ్ధాటి తగ్గలేదుగానీ, అఖిలప్రియపై విమర్శల విషయంలో మాత్రం రోజా కొంత ఆచి తూచి స్పందిస్తున్నారిప్పుడు. రోజా అలా వాయిస్‌ తగ్గించడంతో, ఆమెని రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలిప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారనుకోవాలి.