Home > Politics - Political News
శవ రాజకీయమంటే ఇదే.!

ఓ ఎమ్మెల్యే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.. ఆయన హఠాన్మరణంతో ఉప ఎన్నికలు తప్పనిసరయ్యాయి. మామూలుగా అయితే, ఎవరి మరణం కారణంగా ఉప ఎన్నికలు తలెత్తాయో, ఆ వ్యక్తి కుటుంబానికి చెందినవారికే టిక్కెట్‌ ఇవ్వడం అనేది 'సంప్రదాయం'. అఫ్‌కోర్స్‌, ఈ సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా పాటించెయ్యాలనేం రూలు లేదు. కానీ, అదొక 'గౌరవం'. 

నంద్యాల ఉప ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది.? పద్ధతి ప్రకారం అయితే, నైతిక విలువలకు కట్టుబడి వుంటే మాత్రం భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకే టిక్కెట్‌ ఇవ్వాలి. కానీ, ఆ భూమా నాగిరెడ్డి గెలిచింది ఏ పార్టీ నుంచి.? వైఎస్సార్సీపీ నుంచి. ఆ లెక్కన, అక్కడ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలపకూడదు. అసలంటూ, భూమా నాగిరెడ్డే నైతిక విలువల్ని పక్కన పెట్టి పార్టీ ఫిరాయించాక.. ఇక, ఆ ఉప ఎన్నికల్లో 'నైతికత' గురించి మాట్లాడటమే అనవసరం అన్నది సామాన్యుడి వాదన. 

ఇదిలా వుంటే, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ తమ కుటుంబానికే దక్కుతుందని భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ తెగేసి చెబుతున్నారు. ఇంకోపక్క, ఆ సీటు తనకు కావాలంటున్నారు టీడీపీ సీనియర్‌ నేత శిల్పామోహన్‌రెడ్డి. టిక్కెట్‌ దక్కకపోతే పార్టీ మారడం, ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం వంటి ఆప్షన్స్‌ని ఇప్పుడే ఆయన తెరపైకి తెచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాజాగా ఈ వ్యవహారంపై భేటీ అయి చర్చించారు కూడా. 

ఇలాంటి సందర్భాల్లోనే శవరాజకీయం అన్న మాట తెరపైకొస్తుంటుంది. తల్లి మరణంతో ఎమ్మెల్యే అయిన అఖిల ప్రియ, తండ్రి మరణంతో మంత్రి అయ్యారు. ఇప్పుడేమో, తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టేందుకు నిఖార్సయిన రాజకీయ నాయకురాలిగా పావులు కదుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో, చంద్రబాబు వ్యూహం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సొంత పార్టీలోనే భూమా వర్సెస్‌ శిల్పా 'వివాదం' షురూ చేయించి, పండగ చేసుకుంటున్నారు. శవ రాజకీయాలకే పరాకాష్ట ఇది.