Home > Politics - Political News
టీడీపీ కళ్ళతో: చంద్రబాబే వరుణదేవుడు.!

తెలుగు రాష్ట్రాల్లో వానలు ఎందుకు ఇంత గొప్పగా కురిసేస్తున్నాయో తెలుసా.? వాతావరణ మార్పుల కారణంగా కానే కాదండోయ్‌.! ఇదంతా, 'చంద్రబాబు జలసిరికి హారతి' అనే కాన్సెప్ట్‌ కారణంగానే. చంద్రబాబు అలా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో లేదో, వర్షాలు ఇలా కురిసేస్తున్నాయి. ఒట్టు, ఇది నిజ్జంగా నిజం. శ్రీశైలం డ్యామ్‌ నిండింది.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు గేట్లను తెరచి, కిందికి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నిండిన ఘనతని చంద్రబాబు ఖాతాలో వేసేశారు దేవినేని ఉమ. స్వామిభక్తికి పరాకాష్ట ఇది.! 

చంద్రబాబు పాలన అంటే కరవుకి పండగేనన్న వాదన బలంగా వుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆ విషయమై చంద్రబాబు కూడా కలత చెందుతుంటారనుకోండి.. అది వేరే విషయం. రాజకీయ ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శల్లో 'చంద్రబాబు - కరువుకి బ్రాండ్‌ అంబాసిడర్‌' అనేది ప్రధానమైనదే. చంద్రబాబుని చూస్తే వరుణుడు ఎటో పారిపోతాడన్న సెటైర్‌ ఎప్పటినుంచో వున్నదే. అలాంటిది, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో నిజంగానే జలసిరి కన్పిస్తోందంటే అది ఆశ్చర్యకరమే. 

ఒక్కటి మాత్రం నిజం. చంద్రబాబు కారణంగా వరుణుడు పారిపోడు.. చంద్రబాబు పిలిచాడు కదా.. అని వరుణుడు వచ్చేయడు. ఆఖరికి వర్షాన్ని కూడా రాజకీయం చేసేయగల సమర్థులు మన తెలుగునాట రాజకీయాల్లో వున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా.? అన్నిటికీ మించి, జలసిరికి హారతి కార్యక్రమంపై తొలుత విమర్శలు రావడంతో గుస్సా అయిన చంద్రబాబు, ఇప్పుడు వర్షాలు కురిసి, ప్రాజెక్టులు నిండుతుండడంతో ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలూ పడ్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, చంద్రబాబే వరుణదేవుడన్నట్టుగా ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళి హడావిడి చేసేస్తున్నారు.