Home > Politics - Political News
పవన్ కూడా.. బీకామ్ లో ఫిజిక్స్ బ్యాచ్చేనా…!

అప్పుడెప్పుడో.. 'ఏదేశ మేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ తల్లి నిండు గౌరవమును..' అనే అద్భుత గేయాన్ని గురజాడ అప్పారావు రాశాడు.. అంటూ చెప్పుకొచ్చాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగులోని ఒక గొప్ప గేయాన్ని గుర్తు చేసి.. దాని రచయిత పేరును తప్పుగా చెప్పి అందునా, గురజాడ వంటి మరో గొప్ప కవి ప్రస్తావన తెచ్చి.. అటు ఆ గొప్ప గేయం గురించీ తనకు అవగాహన లేదు, గురజాడ గురించి కూడా అజ్ఙానినే.. అని నిరూపించుకున్నాడు జనసేన అధినేత.

రెండో తరగతి తెలుగు వాచకంలో… ఉంటుంది, ‘ఏ దేశ మేగినా..’ గేయం. దాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. అయితే చే గువేరా గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ కు మాత్రం ఆ గేయం గురజాడ రాశారని వీరావేశంగా చెప్పుకొచ్చారు.

అదే అనుకుంటే.. జనసేనాధిపతి మరోటి వదిలాడు. ఇటీవల తన పార్టీ మీటింగ్ లో జనసేనాధిపతి బల్బును కనుక్కొన్నది ఐన్ స్టీన్ అని చెప్పుకురావడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకైతే ఆరో తరగతి సైన్స్ టెక్ట్స్ బుక్ లో ఉంటుంది.. బల్బును కనుక్కొన్నది థామస్ ఆల్వా ఎడిసన్ అని.

అయితే ఐన్ స్టీన్ బల్బును కనుక్కొన్నాడని.. అది కూడా కొన్ని వేల ప్రయత్నాల తర్వాత కనుక్కొన్నాడని.. జనసేన అదిపతి సెలవివ్వగా.. ఆయన చుట్టూ ఉన్న మేధావులు అంతా చప్పట్లు చరిచారు. పవన్ పిట్టకథ అంతా కరెక్ట్ గా చెప్పాడు కానీ, ఎడిసన్ పేరు బదులు.. ఐన్ స్టీన్ పేరు చెప్పాడు.బల్బ్ ను కనుక్కొన్న ఎడిసన్ విషయంలో.. ఐన్ స్టీన్ పేరు చెప్పడం మాత్రం కామెడీగా ఉంది.

అయినా ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కామెడీలకు ఏమీ లోటు లేదు. బీకామ్ లో ఫిజిక్స్ జలీల్ ఖాన్ మొదలుపెట్టగా… తర్వాత లోకేష్ బాబు దానికి సీక్వెల్స్  కామెడీ ఎపిసోడ్లు చేస్తూనే ఉన్నారు. వాళ్లు చాలరన్నట్టుగా మధ్యలో పవన్ కల్యాణ్ కూడా తోడవ్వడంతో.. యూ టూ పవన్ కల్యాణ్.. అనుకోవాల్సి వస్తోంది. ఏం మాట్లాడినా.. అర్థం కాకున్నా, తప్పులున్నా.. చప్పట్లు కొట్టే అభిమానులు ఉంటే ఉండొచ్చు గాక.. పవన్ కల్యాణ్ మాత్రం ఇలాంటి విషయాలను సమీక్షించుకోవాల్సిందే! లేకపోతే.. బీకామ్ లో ఫిజిక్స్ ట్రూప్ లో భాగం అయిపోవాల్సి వస్తుంది సుమా!