Advertisement


Home > Politics - Political News
వెంకయ్యని పీకేసి, మోసేసిన మోడీ.!

ఉపరాష్ట్రపతిగా ఈ రోజు ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు వెంకయ్యనాయుడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా.. ఎన్నో పదవులు చేపట్టిన వెంకయ్యకు, ఉపరాష్ట్రపతి పదవి చాలా చాలా ప్రత్యేకమైనదే. కానీ, ఏం చేస్తాం.? అది ఆయన కోరుకున్న పదవి కానే కాదు. వద్దనుకున్న పదవి కూడా.! అయినాగానీ, అక్కడున్నది నరేంద్రమోడీ.. ఆ ఒత్తిడి ముందు వెంకయ్య, తన ఆలోచనల్ని పక్కన పెట్టక తప్పలేదు. 

వెంకయ్యకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి, పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పించిన నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి పదవికి దూరం చేసి, ఆఖరికి బీజేపీకి కూడా దూరం చేసి, ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన రెండో పదవి అయినప్పటికీ, కేంద్ర మంత్రి పదవితో పోల్చితే ఉపరాష్ట్రపతి పదవికి వున్న 'పవర్‌' ఏపాటితో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, వెంకయ్య కేంద్ర మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసే క్రమంలో కొంత భావోద్వేగానికి గురయ్యారు. 

ఇంతా చేసి, ఇప్పుడు నరేంద్రమోడీ వెంకయ్యను ఆకాశానికెత్తేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన వ్యక్తి తొలిసారిగా ఉపరాష్ట్రపతి అయ్యారంటూ వెంకయ్యను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది కూడా ఓ ప్రత్యేకతేనా.? అనడక్కండి.. నరేంద్రమోడీ పొగిడెయ్యాలనుకున్నారు, పొగిడేశారంతే. వెంకయ్య వాగ్ధాటి గురించి, వెంకయ్య గొప్పతనం గురించీ రాజ్యసభలో నరేంద్రమోడీ చాలా గొప్పగా మాట్లాడేశారండోయ్‌.!