Advertisement


Home > Politics - Political News
వైఎస్‌ జగన్‌కి 'కడప' దెబ్బ.!

వైఎస్సార్సీపీ, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. కర్నూలులోనూ, నెల్లూరులోనూ పరాజయమే వైఎస్సార్సీపీని పలకరించింది. ఎందుకిలా.? సమాధానం సింపుల్‌.. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసింది గనుక. అదొక్కటే కాదు, అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడింది. అధికార పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. ఇలా ఎన్నయినా చెప్పొచ్చుగాక.! 

వైఎస్సార్సీపీ పరాజయం.. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. అలాంటిలాంటి దెబ్బకాదు, సొంత ఇలాకాలో ఎమ్మెల్సీని గెలిపించుకోలేని దుస్థితి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌దేనంటూ విమర్శలు వెల్లువెత్తడం సహజమే. అధికార పార్టీ క్యాంప్‌ రాజకీయాలు నిర్వహించింది.. దురదృష్టవశాత్తూ సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథుల్ని కాపాడుకోవడానికి వైఎస్సార్సీపీ కూడా క్యాంప్‌ రాజకీయాలు నిర్వహించాల్సి వచ్చింది. ఏం చేసినాసరే, పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయింది. అధికార పార్టీని నిలువరించలేకపోయింది.

'మేం గెలిచేశాం.. కడప నుంచి ఇక వైఎస్‌ జగన్‌ని తరిమికొట్టేసినట్లే..' అని అధికార పార్టీ గర్వంగా చెప్పేసుకుంటోంది. నైతికం.. అనైతికం.. అన్న విషయాలు రాజకీయాల్లో పనికిరావు. ఎందుకంటే, రాజకీయం అంటేనే అనైతికతగా మారిపోయిందిప్పుడు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా గెలుపు తమదేనన్న ధీమా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తర్వాత వైఎస్‌ జగన్‌ నుంచి వ్యక్తమయ్యింది. కానీ, వైఎస్సార్సీపీకి పరాజయం తప్పలేదు. 

కర్నూలులో శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి టీడీపీ నుంచి విజయం సాధించారు. కడపలో బీటెక్‌ రవి గెలుపొందారు. మూడు చోట్లా టీడీపీకి వైఎస్సార్సీపీ గట్టిపోటీనే ఇచ్చింది. అయితే, ఆ పోటీ లెక్కల్లోకి రాదిప్పుడు. ఓటమి ఓటమే.! ఇప్పుడు జగన్‌ ఏం చెప్పినా దానికి విలువ వుండదుగాక వుండదు. అందరికీ తెల్సిన విషయమే, ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి. కానీ, ఈ ఓటమి నుంచి వైఎస్సార్సీపీ గుణపాఠం నేర్చుకోవాల్సిందే. లేదూ, షరామామూలుగా టీడీపీపై విమర్శలు చేసేసి ఊరుకుంటాం.. అంటే మాత్రం, 2019 ఎన్నికల్లో మరింత భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు.