Home > Politics - Political News
ప్రజలు ఓట్లేసిన చోట.. టీడీపీ హవా ఏదీ?

స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలిచే సరికి తమ అధికారం మరో ఐదేళ్లపాటు ఎక్స్ టెండ్ అయినట్టుగా ఫీలవుతున్నారు తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అభిమానులు, అనుకూల మీడియా. మరి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ రీతిన నెగ్గిందనే విషయం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నా... ఈ ఆత్మవిశ్వాసం మాత్రం శ్రుతి మించిపోతోంది. బహుశా ఎక్కడైనా కొని గెలవగలమనే విశ్వాసం కాబోలు ఇది.

మరి అన్నిచోట్లా కొని గెలవడం అనేది సాధ్యంకాదనే అంశం కేవలం కొన్ని గంటల్లోనే టీడీపీకి క్లారిటీ వచ్చింది. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్స్ కోటాలోని ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. ప్రస్తుతం ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది.

టీచర్స్ కోటా విషయానికి వస్తే.. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమల పరిధిల్లోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరువు నిలుపుకోలేకపోయింది. ఇక్కడ ప్రతిపక్షాల అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పులో విఠపు, పశ్చిమలో కత్తి నరసింహారెడ్డి విజయకేతనం ఎగరేశారు. వామపక్ష పార్టీల తరపున పోటీ చేసిన వీళ్లకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఇక్కడ సిట్టింగులకు తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చింది. గత ఎన్నికల్లో గెలిచిన వారిని పార్టీలోకి చేర్చుకుని.. వారినే అభ్యర్థులుగా పెట్టింది. అయితే ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వోద్యుగులైన టీచర్లు వేసిన ఓట్లలో అధికార పార్టీపై వైఖరేమిటో స్పష్టం అయ్యింది.

ఇక పట్టభద్రుల ఎన్నిక విషయానికి వస్తే.. తాము పోటీ పెట్టిన చోట వైసీపీ జయకేతనం ఎగరేసే దిశగా వెళ్తోంది.  పశ్చిమ రాయలసీమలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయం దిశగా ముందుకు వెళ్తున్నాడు. దాదాపు నాలుగువేల ఓట్ల మెజారిటీని సాధించిన ఆయన గెలవడం ఖాయమే అని పోలింగ్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. బ్యాలెట్ పేపర్లపై జరిగిన ఎన్నిక కావడంతో కౌంటింగ్ లేట్ అవుతోంది.

ప్రజాతీర్పు అంటే.. అమ్ముడుపోయే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇచ్చేది కాదు. అలాగని టీచర్ల, పట్టభద్రులు ఇచ్చింది కూడా వందశాతం ప్రజాతీర్పు కాకపోవచ్చు. అయితే.. టీచర్ల, పట్టభద్రుల ఓట్లను మాత్రం ర్యాండమ్ శాంపిల్స్ గా తీసుకోవచ్చు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి దృక్పథం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫలితాలను బట్టి కొట్టాలి మరి తొడలు.