Advertisement


Home > Politics - Political News
వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే..

వైఎస్‌ జగన్‌, తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటూ ప్రగల్భాలు పలికారనీ, మాట నిలబెట్టుకోలేకపోయారనీ అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, 'ప్రత్యేక హోదా' విషయమై మీడియా ముందుకొచ్చి ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తున్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం నినదిస్తామనీ, అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్‌ ప్రకటించిన మాట వాస్తవమే. అయితే, వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే, ప్రత్యేక హోదా వస్తుందా.? కనీసపాటి విజ్ఞత లేని మాటలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయంటే, వారి ఆలోచనల 'స్థాయి' ఏంటనేది అర్థమవుతోందిక్కడ.! 

కేంద్రంతో టీడీపీ తెగతెంపులు చేసుకుంటే, కాస్తో కూస్తో అదొక గట్టి నిరసనగా కన్పించేది. రాజీనామా చేయడం సంగతి తర్వాత, ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యమే ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయిందాయె.! నరేంద్రమోడీ దగ్గర వంగి వంగి దండాలు పెట్టడంతోనే సరిపోతోంది టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకి. అమరావతి శంకుస్థాపనకు నరేంద్రమోడీ వస్తే, ప్రత్యేక హోదా పేరెత్తలేక, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేక.. చంద్రబాబు పడ్డ పాట్లు ఎలా మర్చిపోగలం.? 

ప్రతిపక్షం రాజకీయ అవసరాల కోసమే ప్రత్యేక హోదా నినాదం భుజానికెత్తుకుందన్న టీడీపీ నేతల మాటలే నిజమనుకుందాం. అందులో తప్పేముంది.? ప్రత్యేక హోదా వస్తే, ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్‌కి ఉపయోగమే కదా.! చంద్రబాబు 'అద్భుతః' అన్న ప్రత్యేక ప్యాకేజీ నీటి మీద రాతల్లా ఎప్పుడో చెరిగిపోయింది. అయినా, చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక దుస్థితిని సవివరంగా వెల్లడించారాయె. చంద్రబాబు తక్కువేమన్నా తిన్నారా.? కేంద్రం నుంచి నిధులు రావడంలేదు మొర్రో.. అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. 

కేంద్రం అసలు ఆంధ్రప్రదేశ్‌ని లెక్కచేయకపోయినాసరే, కేంద్రంతో టీడీపీ అంటకాగుతుందట. ఇది చంద్రబాబు థియరీ. దాన్ని వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే, అది మహా నేరం. ఇది టీడీపీ వింత వాదన. పైగా, వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసెయ్యాలట. అవును మరి, నంద్యాలలో కోట్లు ఖర్చు చేసి గెలిచేసినట్లు, వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసేస్తే, తద్వారా ఖాళీ అయ్యే నియోజకవర్గాల్లో గెలుపు కోసం 'వ్యూహాలు' సిద్ధం చేసేసుకోవాలి కదా.. అదీ అసలు ఆతృత. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరి.